తల్లిని కాపాడబోయి కత్తిపోటుకు కొడుకు బలి
ABN , Publish Date - May 24 , 2025 | 01:23 AM
భార్యాభర్తల మధ్య తలెత్తిన ఘర్షణలో తల్లిని కాపాడబోయి, తండ్రి చేతిలో కత్తిపోటుకు గురై కుమారుడు చనిపోయాడు. ఈ ఘటన శుక్రవారం ఎర్రగొండపాలెంలో చోటుచేసుకుంది.
మద్యం మత్తులో పొడిచిన తండ్రి
ఎర్రగొండపాలెంలో ఘటన
ఎర్రగొండపాలెం, మే 23 (ఆంధ్రజ్యోతి) : భార్యాభర్తల మధ్య తలెత్తిన ఘర్షణలో తల్లిని కాపాడబోయి, తండ్రి చేతిలో కత్తిపోటుకు గురై కుమారుడు చనిపోయాడు. ఈ ఘటన శుక్రవారం ఎర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఎర్రగొండపాలెంలోని పాలశీతల కేంద్రం ఎదురు జాతీయ రహదారి పక్కన తోట వెంకటలక్ష్మీనారాయణరావు (అలియాస్ బుజ్జి), భార్య వరలక్ష్మి నివాసం ఉంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి 30 ఏళ్ల క్రితం వచ్చి స్థిరపడిన వారికి ఇద్దరు కుమారులున్నారు. చిరువ్యాపారం చేసే దుకాణంతోపాటు సొంత ఇల్లు కూడా అక్కడే ఉంది. శుక్రవారం భార్యాభర్తల మధ్య గొడవ తలెత్తింది. మద్యం మత్తులో ఉన్న లక్ష్మీనారాయణ భార్య వరలక్ష్మిని కొడుతుండగా రెండో కుమారుడు కాశీవిశ్వనాథ్ (29) అడ్డుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి అక్కడే ఉన్న కూరగాయలు కొసే కత్తితో కాశీవిశ్వనాథ్‌ను ఎడమ పక్కన చాతీలో పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమవుతుండగా సమీపంలో ఉన్న స్నేహితుడు గమనించి కాశీవిశ్వనాథ్‌ను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి స్థానిక ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. అక్కడ డాక్టర్లు ప్రాథమిక వైద్యం చేశారు. మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ వైద్యశాలకు 108 వాహనంలో తరలిస్తుండగా మధ్యలో మృతి చెందాడు. మృతదేహానికి శుక్రవారం సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించారు. తల్లి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ చౌడయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.