ప్రజా దర్బార్‌లో సమస్యలకు పరిష్కారం
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:38 PM
నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే కందుల
తర్లుపాడు, డిసెంబరు 16 (ఆంధ్రజోతి): నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ప్రజా దర్బార్ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ వివిధ గ్రామాల నుంచి వివిధ సమస్యలపై విచ్చన అర్జీలను తక్షణమే సంబంధిత శాఖల అధికారులకు అర్జీలు ఇస్తూ వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. మండలంలో వివిధ గ్రామాల నుంచి వివిధ సమస్యలపై 105 అర్జీలు వచ్చాయి. 75 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే వచ్చాయి. మండలంలో నెలకొన్న రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కిషోర్‌కుమార్‌ను ఆదేశించారు. తర్లుపాడు గ్రామానికి చెందిన కొంగని రంగలక్ష్మమ్మ తమ భూమి సమస్యపై 10 సంవత్సరాల నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ పరిష్కారం కాలేదని ఎమ్మెలే ముందు వాపోయింది. నాయకుడుపల్లె కాలనీ వాసులు తమ శ్మశానాన్ని బండబారు నాగరాజు ఆక్రమించుకుని, పూర్వం నుంచి ఉన్న సమాధులను కూడా చదును చేశారని, శ్మశాన ఆక్రమణదారుడిపై చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు వినతిపత్రం సమర్పించారు. ఎక్కువగా పింఛన్‌లు, ఇళ్ల స్థలాలు, రెవెన్యూ, సంక్షేమ పథకాల ప్రయోజనాలు, గ్రామాల అభివృద్ధికి సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులపై వచ్చిన అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించి, వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఈఈ నాగేశ్వరరావు, ఎంపీడీవో అన్నమ్మ, మండలంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అమరవీరుల స్ఫూర్తి అజరామరం
మార్కాపురం : దేశ భద్రత కోసం సరిహద్దుల్లో ప్రాణాలొడ్డి పోరాడిన అమరవీరుల స్ఫూర్తి అజరామరం అని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక తర్లుపాడు రోడ్డులోని అమరవీరుల స్థూపం వద్ద మంగళవారం మధ్యాహ్నం విజయ్ దివస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా అందరూ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ 1971లో ఇదే రోజున భారత సైన్యం పాకిస్థాన్‌పై అఖండ విజయం సాధించిందన్నారు. ఈ క్రమంలో ఎందరో సైనికులు అమరులయ్యారన్నారు. వారి స్ఫూర్తితో యువత దేశ రక్షణ కోసం పాటుపడాలన్నారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి ఇమ్మడి కాశీనాథ్, రిటైర్డ్ సైనికోద్యోగులు పాల్గొన్నారు.
ప్రజల తలరాతలు మారనున్నాయి
ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం : మార్కాపురం ప్రాంత ప్రజల తలరాతలు ఇకపై మారనున్నాయని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక 23వ వార్డులో మంగళవారం రాత్రి మార్కాపురం జల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన నేపథ్యంలో కృతజ్ఞత సభ జరిగింది. ముందుగా వార్డులోని మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా పశ్చిమ ప్రాంత ప్రజలు వెనుకబాటుతనంతోనే అల్లాడిపోతున్నారన్నారు. జిల్లా అయితే వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు వస్తాయన్నారు. అంతేకాక పారిశ్రామికంగా కూడా అభివృద్ధి పరిచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. 2026 అక్టోబర్ నాటికి వెలిగొండ జలాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. అంతేకాక మార్కాపురంలో మిర్చి యార్డును కూడా ఏర్పాటు చేయించేందుకు తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని అన్నారు. ఇలా ఒక్కటికాదు రెండుకాదు ఇకపై ఈ ప్రాంతంలో అభివృద్ధి పరవళ్లు తొక్కడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఏఎమ్‌సీ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, టీడీపీ నియోజకవర్గ పోల్‌మేనేజ్‌మెంట్ ఇన్‌చార్జి కందుల రామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, ఇనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇమ్మడి కాశీనాఽథ్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ డి.నాగూర్‌వలి, డాక్టర్ మౌళాలి, పఠాన్ ఇబ్రహీంఖాన్ పాల్గొన్నారు.