Share News

ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యకు పరిష్కారం

ABN , Publish Date - Aug 09 , 2025 | 01:39 AM

: మండలంలోని మిన్నేకల్లు గ్రామంలోని వ్యవసాయ బోర్లకు ప్రభుత్వం విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చింది.

ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యకు పరిష్కారం

సంతమాగులూరు ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని మిన్నేకల్లు గ్రామంలోని వ్యవసాయ బోర్లకు ప్రభుత్వం విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చింది. ఏడేళ్లుగా ఆపరిష్కృతంగా ఉన్న సమస్యకు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చొరవతో పరిష్కారం లభించిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మిన్నేకల్లు గ్రామానికి చెందిన 25 మంది రైతులు తంగేడుమల్లి మేజర్‌ చివరి ఆయ కట్టులో భూములు ఉన్నాయి. ఇక్కడకు సక్రమంగా నీరు సరఫరా కాకపోవడంతో రైతులే వ్యవసాయ బోర్లు ఏర్పాటు చేసుకు న్నారు. అయితే వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ కోసం వీరు ఏడేళ్లగా అధికారులు చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారు. దీంతో చేసేది లేక బోర్లలోని నీటి ట్రాక్లర్ల జనరేటర్లు, ఆయిల్‌ ఇంజన్ల ద్వారా తోడుకొన్నారు. దీంతో ఏటా ఒక్కో ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు అదనపు ఖర్చు వస్తోంది. దీంతో ఈ విషయాన్ని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టి పాటి రవికుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన అధికారులతో మాట్లాడారు. మొత్తం 2.5 కిలోమీటర్ల నూతన లైన్‌ ఏర్పాటు చేయడం, లోవోల్టేజీ రాకుండా ఏడు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు అవసరమని గుర్తించారు. ఆ మేరకు రూ. 30 లక్షల మేర ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 మంది రైతుల దరఖాస్తు చేసుకోగా, రైతులకు ప్రభుత్వం ఇంత మొత్తం వెచ్చించే అవకాశం లేదని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ రాష్ట్రస్థాయి అధికారులతో చర్చించి ఆమోదింపజేశారు. ప్రతి రైతు కేవలం తన వాటాగా రూ.6,200 డీడీ ద్వారా తీసుకొన్నారు. మిగిలిన నిధులను ప్రభుత్వం వెచ్చింది. విద్యుత్‌ శాఖ అద్దంకి డీఈ నల్లూరి మస్తాన్‌రావు, సంతమాగులూరు ఏఈ దీపక్‌ రెడ్డిల పర్యవేక్షణలో రెండున్నర నెలల కాలంలో నూతన విద్యుత్‌ లైన్ల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల అమర్చి పనులు పూర్తి చేశారు. వ్యవసాయ సీజన్‌కు ముందే విద్యుత్‌సరఫరా రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 09 , 2025 | 01:39 AM