Share News

ప్రజాకళలతోనే సమాజ మార్పు సాధ్యం

ABN , Publish Date - Aug 23 , 2025 | 12:04 AM

అక్షరాన్ని నిషేధిస్తే ఆగదని, ప్రజాకళలతోనే సమాజమార్పు సాధ్యమని ప్రజాకవి, రచయిత, గాయకులు గోరేటి వెంకన్న చెప్పారు. సీపీఐ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న కళా ఉత్సవాలలో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం ఒంగోలు విచ్చేశారు.

ప్రజాకళలతోనే సమాజ మార్పు సాధ్యం
మాట్లాడుతున్న గోరేటి వెంకన్న

మీడియా సమావేశంలో గాయకులు గోరేటి వెంకన్న

ఒంగోలు కార్పొరేషన్‌, ఆగస్టు (ఆంధ్రజ్యోతి) : అక్షరాన్ని నిషేధిస్తే ఆగదని, ప్రజాకళలతోనే సమాజమార్పు సాధ్యమని ప్రజాకవి, రచయిత, గాయకులు గోరేటి వెంకన్న చెప్పారు. సీపీఐ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న కళా ఉత్సవాలలో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం ఒంగోలు విచ్చేశారు. స్థానిక మీడియా కెమెరామెన్‌ అసోసియేషన్‌ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కళలు, సాంకేతికత, పెట్ట్టుబడి ఇవి మూడు కలవకూడదన్నారు. కళ అనేది అంతర్లీనంగా ఉంటూప్రజలను ఆలోచింపచేసేలా, ఆనందింప చేసేలాఉండాలన్నారు. నేటి సినిమాలు బూతు సాహిత్యంతో నిండుకొని, ఇవే అసలైన కళలు అనే తీరుగా భ్రమింపచేస్తున్నాయని విమర్శించారు. సినిమా చాలా గొప్పదని, అదే సినీరంగంలో తమన్‌, బోస్‌, సత్యజిత్‌రే, హృతిక్‌ ఘటక్‌ వంటి గొప్ప కళాకారులు, దర్శకులు కూడా ఉన్నారని చెప్పారు. నేటి తరంలోని కొన్ని సినిమాలువికృతం, భయానకం, రాచరికంతో కూడిన హింసా సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయన్నారు. నిజమైన కళకు, మంచి పుస్తకానికి, ఆలోచింపచేసే రచనలకు ఎల్లపుడూ ఆదరణ ఉంటుందని వెంకన్న తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ సీపీఐ 100ఏళ్ల పోరాట చరిత్రను పురస్కరించుకుని ఒంగోలులో నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభల సందర్భంగా కళా ఉత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. ఈనెల 23వ తేదీన భారీ ప్రజా ప్రదర్శనలో బహిరంగ సభకు వెయ్యి మంది కళాకారులతో, 100 గొంతుకలతో, వంద పాటలతో, వంద డప్పులతో, వంద కోలాట కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు ముఖ్య అతిఽథులుగా సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణతోపాటు పలువురు ముఖ్యలు పాల్గొంటున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్‌, ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామకృష్ణ, పాట వెంకన్న, శ్రీశైలం గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2025 | 12:04 AM