స్మార్ట్ కార్డులు రెడీ
ABN , Publish Date - Jul 31 , 2025 | 01:39 AM
ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అక్రమాలను అరికట్టడంతోపాటు పేదలకు అన్ని అవసరాలకు ఉపయోగపడే విధంగా రైస్‌కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు సన్నద్ధమైంది.
వచ్చేనెల 25నుంచి రైస్ కార్డుల స్థానంలో పంపిణీ
దానిపై ఇంటి యజమాని ఫొటో, కుటుంబ సభ్యుల పేర్లు
రాజముద్ర, క్యూఆర్‌కోడ్ కూడా..
జిల్లావ్యాప్తంగా 6.61 లక్షల మందికి ఇవ్వనున్న అధికారులు
ఒంగోలు కలెక్టరేట్, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అక్రమాలను అరికట్టడంతోపాటు పేదలకు అన్ని అవసరాలకు ఉపయోగపడే విధంగా రైస్‌కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు సన్నద్ధమైంది. క్యూఆర్ కోడ్ ఉండే ఈ స్మార్ట్‌కార్డులను వచ్చేనెల 25 నుంచి పౌరసరఫరాల శాఖ అధికారులు పంపిణీ చేయనున్నారు. జిల్లాలో 1,392 రేషన్‌షాపుల పరిధిలో 6,61,187 తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న రైస్ కార్డుల్లో ఆ కుటుంబానికి చెందిన సభ్యులందరితో ఫొటో ఉండేది. ఇప్పుడు ఆ స్థానంలో కుటుంబ యజమాని ఫొటో ఉంటుంది. ఇతర సభ్యుల పేర్లు మాత్రమే నమోదు చేస్తారు. గతంలో రైస్ కార్డులపై ఎవరు అధికారంలో ఉంటే ఆ సీఎం ఫొటోలు కార్డులపై ఉండేవి. ఇప్పుడు ఈ స్మార్ట్ కార్డుల్లో ప్రభుత్వ చిహ్నం మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం ఇవ్వనున్న స్మార్ట్ కార్డులు బ్యాంకు డెబిట్ కార్డు (ఏటీఎం)ల తరహాలో ఉండనున్నాయి. పారదర్శకతతో రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టర్‌తో వీటిని అనుసంధానం చేస్తారు. తద్వారా రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టవచ్చని అధికారులు చెప్తున్నారు.