Share News

స్మార్ట్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌..

ABN , Publish Date - Aug 09 , 2025 | 01:25 AM

తెల్ల రేషన్‌ కార్డుల స్థానంలో స్మార్ట్‌ కార్డులు జిల్లాకు వస్తున్నాయి. వాటిని మండలాల వారీగా అందించేందుకు అధికారులు చర్యలు తీసు కున్నారు. ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్‌ కార్డుల స్థానంలో క్యూఆర్‌ కోడ్‌తో స్మార్ట్‌ కార్డులను ఇవ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది.

స్మార్ట్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌..

జిల్లాకు రానున్న 6.61 లక్షల కార్డులు

చెన్నై నుంచి నేరుగా మండలాలకు చేరిక

25 నుంచి పంపిణీకి సన్నాహాలు

ఒంగోలు కలెక్టరేట్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : తెల్ల రేషన్‌ కార్డుల స్థానంలో స్మార్ట్‌ కార్డులు జిల్లాకు వస్తున్నాయి. వాటిని మండలాల వారీగా అందించేందుకు అధికారులు చర్యలు తీసు కున్నారు. ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్‌ కార్డుల స్థానంలో క్యూఆర్‌ కోడ్‌తో స్మార్ట్‌ కార్డులను ఇవ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 1,392 రేషన్‌షాపుల పరిధిలో 6,61,141 కార్డులు ఉండగా వాటి స్థానంలో స్మార్ట్‌ కార్డులను ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. వీటి ప్రింటింగ్‌ను చెన్నైలో ఒక సంస్థకు ప్రభు త్వం అప్పగించగా అది పూర్తిచేసింది. ఈనెల 25వ తేదీ నుంచి రేషన్‌షాపుల వారీగా స్మార్ట్‌కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో తదనుగుణంగా సంబంధిత అదికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే జిల్లాలోని 38 మండలాల వివరాలను స్మార్ట్‌ కార్డులు ప్రింట్‌ చేసిన ప్రతినిధులకు అందజేశారు. అక్కడి నుంచి నాలుగైదు రోజుల్లో నేరుగా మండలాలకు పంపనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇస్తున్న స్మార్ట్‌ కార్డులు ఏటీఎం తరహాలో ఉంటాయి. అందులో ఇంటి యజమాని పేరు ఉంటుంది. స్మార్ట్‌ కార్డుపై రాజకీయ నేతల ఫొటోలు, రంగులు ఉండవు. దీన్ని ప్రజలు ఇతర కార్డులమాదిరిగా వినియోగించుకునే విధంగా రూపొందించారు. వేలిముద్ర పడకపోయినా స్మార్ట్‌ కార్డుపై ఉండే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి రైస్‌ తీసుకోవచ్చు. ఈనెల 25వతేదీ నుంచి ఆయా రేషన్‌షాపుల పరిధిలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో కార్డుదారులకు స్మార్ట్‌ కార్డుల పంపిణికీ రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

Updated Date - Aug 09 , 2025 | 01:25 AM