అరవై శాతం మంది అనర్హులే!
ABN , Publish Date - Aug 20 , 2025 | 01:24 AM
మంచానికే పరిమితమయ్యాం..! కాళ్లు కదలటం లేదు.. చేతులు ఆడటం లేదు.. వీల్‌చైర్‌లోనే నిత్యం జీవనం సాగిస్తున్నాం..! అంటూ హెల్త్ పింఛన్ల కేటగిరీ కింద నెలవారీ రూ.15వేలు పొందుతున్న వారిలో 60 శాతం మంది అనర్హులు ఉన్నట్లు తేలింది.
ఆరోగ్య పింఛన్లు పొందుతున్న వారిలో 747 మంది బోగస్
వీరిలో 495మందికి ఇతర పింఛన్లు
దివ్యాంగుల కేటగిరీలో 3,340 మంది అనర్హులు
వారికి వచ్చే నెల నుంచే కట్
నోటీసులు అందుకున్న వారిలో అర్హులు ఉంటే పునరుద్ధరణ
ఒంగోలు నగరం, ఆగష్టు 19 (ఆంధ్రజ్యోతి): మంచానికే పరిమితమయ్యాం..! కాళ్లు కదలటం లేదు.. చేతులు ఆడటం లేదు.. వీల్‌చైర్‌లోనే నిత్యం జీవనం సాగిస్తున్నాం..! అంటూ హెల్త్ పింఛన్ల కేటగిరీ కింద నెలవారీ రూ.15వేలు పొందుతున్న వారిలో 60 శాతం మంది అనర్హులు ఉన్నట్లు తేలింది. రాష్ట్రప్రభుత్వం జిల్లాలో ఆరోగ్య పింఛన్లు పొందుతున్న వారి ఇంటింటికీ వైద్య బృందాలను పంపించి తనిఖీ చేయించింది. అందులో భారీగా బోగస్‌లు ఉన్నట్లు తేలింది. జిల్లాలో ఈ ఏడాది జనవరి నాటికి హెల్త్ పింఛన్లు పొందుతున్న వారి సంఖ్య 1,224గా ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేటగిరీ కింద బోగస్ సర్టిఫికెట్లను సృష్టించుకుని వందల సంఖ్యలో మంజూరు చేయించుకున్నారు. నెలవారీ దర్జాగా రూ.15వేలు లబ్ధి పొందుతున్నారు.
747 మంది అనర్హులు
ప్రస్తుత ప్రజా ప్రభుత్వ ఆదేశాలతో పరిశీలన చేపట్టిన ప్రత్యేక వైద్య బృందాలు 747 మంది ఈ పింఛన్లు తీసుకునేందుకు అనర్హులుగా తేల్చాయి. 85 శాతం వికలత్వం ఉండి పూర్తిగా మంచానికో లేదా వీల్‌చైర్‌కో పరిమితమైన వారు మాత్రమే హెల్త్ పింఛన్ రూ.15వేలు పొందేందుకు అర్హులు. కాగా సాధారణ వికలత్వం, అసలు వైకల్యం లేనివారు కూడా ఈ కేటగిరీ కింద పింఛన్ పొందుతూ ఉన్నారు. దీంతో లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి వైద్య బృందాలు పరిశీలన చేపట్టాయి. 747 మందిని అనర్హులుగా తేల్చాయి. వీరిలో 252 మంది ఏ కేటగిరీ కింద కూడా పింఛన్ పొందేందుకు అర్హులు కారని వైద్యబృందాలు నిర్ధారించాయి. 392 మందికి 40శాతం కంటే ఎక్కువ 85శాతం కంటే తక్కువ వికలత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం వీరికి సెప్టెంబరు నుంచి దివ్యాంగుల కేటగిరీ కింద రూ.6వేల పింఛన్ ఇవ్వనుంది. మరో 103 మందికి హెల్త్ పింఛన్ పొందేందుకు ఎలాంటి అర్హత లేకపోయినా వీరికి 60 ఏళ్ల వయసు దాటిన నేపథ్యంలో వృద్ధాప్య పింఛన్ కేటగిరి కింరీ నెలకు రూ.4వేల పింఛన్ అందజేయనుంది. 252 మందికి పూర్తిగా పింఛన్‌ను నిలిపివేయనున్నారు.
దివ్యాంగుల పింఛన్లలో 3,340 మంది అనర్హులు..
జిల్లాలో దివ్యాంగుల కేటగిరీ కింద పింఛన్ పొందుతున్న వారు 32,875 మంది ఉన్నారు. వీరు ప్రస్తుతం ప్రతినెలా రూ.6వేల లబ్ధి పొందుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల పింఛన్లలో కూడా భారీగా బోగస్‌లకు చోటు కల్పించారు. చిటికెన వేలు లేకపోయినా 50శాతం వికలత్వం చూపిస్తూ సదరమ్ సర్టిఫికెట్లు జారీచేశారు. దీంతో ఈ కేటగిరీ కింద పింఛన్ పొందుతున్న లబ్ధిదారులను కూడా రాష్ట ప్రభుత్వం ఫిబ్రవరి మాసం నుంచి తిరిగి వైద్యపరీక్షలు నిర్వహించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూలై వరకు మొత్తం 28,965 మందికి వైద్యశాలల్లో పరీక్షలు నిర్వహించగా 3,340 మంది అనర్హులుగా తేలారు. వీరికి సెప్టెంబర్ నుంచి పింఛన్ పంపిణీ నిలిపివేయనున్నారు. కాగా 1,434 మంది పరీక్షలకు హాజరుకాకుండా ముఖం చాటేశారు. ఇప్పటివరకు దివ్యాంగుల కేటగిరీ కింద పింఛన్లు పొందుతున్న వారిలో ఇంకా 6,016 మందికి వికలత్వ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం సదరమ్ పరీక్షలు తిరిగి నిర్వహించి అనర్హులుగా తేలిన వారిలో 567 మందికి 40శాతం కంటే వికలత్వం తక్కువగా ఉండటం వలన ఆ పింఛన్ రద్దుచేసి వారికి 60 సంవత్సరాల వయస్సు నిండి ఉండటంతో సెప్టెంబర్ నుంచి వృద్ధాప్య పింఛన్ నెల వారీ రూ.4వేలు అందజేయనున్నారు. మొత్తం మీద జిల్లాలో బోగస్‌లు గుట్టురట్టయి సెప్టెంబర్ నుంచి 252మంది హెల్త్ పింఛన్ పొందుతున్న వారికి, 3,340 మంది దివ్యాంగుల కేటగిరి కింద పింఛన్ పొందుతున్న వారికి కట్ చేయనున్నారు.
అర్హులు ఉంటే తిరిగి అప్పీలు చేసుకోవచ్చు
అనర్హులుగా గుర్తించిన లబ్ధిదారులకు వారంరోజులుగా సచివాలయాల ద్వారా నోటీసులు జారీచేస్తున్నారు. వారిలో అర్హులు ఉంటే నోటీసు అందుకున్న నెలరోజులలోపు సంబంధిత ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్‌కు అప్పీలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. వారికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించి అర్హులు అని నిర్ధారణ అయితే రద్దయిన పింఛన్‌ను వెంటనే పునరుద్ధరించి నగదును అందజేస్తారు.