ఆరేళ్లుగా ఎదురుచూపులు
ABN , Publish Date - Jun 04 , 2025 | 01:47 AM
అప్పట్లో టీడీపీ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి వర్గాల వారికోసం టిడ్కో ఇళ్ల పథకాన్ని చేపట్టింది. సొంతింటి కలను నిజం చేసేందుకు ఎక్కడికక్కడ స్థలాలను సేకరించి అపార్ట్‌మెంట్ తరహాలో గృహాల నిర్మాణాన్ని చేపట్టింది. మూడు రకాల విస్తీర్ణాల్లో అప్పట్లో టిడ్కో ఇళ్లను నిర్మిందేందుకు లబ్ధిదారులను ఎంపిక చేసింది.
టిడ్కో ఇళ్లకు రూ.25వేలు చెల్లించిన లబ్ధిదారులు
అటు ప్లాట్లు ఇవ్వరు.. ఇటు డబ్బులు చెల్లించరు
గతంలో పట్టించుకోని వైసీపీ పాలకులు
ప్రస్తుత ప్రభుత్వంపైనే పేదల ఆశలు
మార్కాపురం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): అప్పట్లో టీడీపీ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి వర్గాల వారికోసం టిడ్కో ఇళ్ల పథకాన్ని చేపట్టింది. సొంతింటి కలను నిజం చేసేందుకు ఎక్కడికక్కడ స్థలాలను సేకరించి అపార్ట్‌మెంట్ తరహాలో గృహాల నిర్మాణాన్ని చేపట్టింది. మూడు రకాల విస్తీర్ణాల్లో అప్పట్లో టిడ్కో ఇళ్లను నిర్మిందేందుకు లబ్ధిదారులను ఎంపిక చేసింది. వాటిల్లో 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు నిర్మాణం చేయాలని యోచించారు. కానీ ఎక్కువ శాతం 300 చదరపు అడుగుల ప్లాట్లకే ఎక్కువ మంది మొగ్గు చూపారు. లబ్ధిదారుల నుంచి రూ.500 చొప్పున కనీస మొత్తాన్ని సేకరించారు. బ్యాంకర్ల ద్వారా రుణం ఇప్పించి మిగిలిన మొత్తం ప్రభుత్వమే చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అంతేకాక 430 చదరపు అడుగుల విస్తీర్ణం ప్లాట్లకు కూడా మార్కాపురంలో 240 మంది రూ.25వేల చొప్పున మునిసిపల్ కమిషనర్ పేరున చెల్లించారు. అప్పట్లో కేవలం రూ.500 చెల్లించిన వారికి మాత్రమే అపార్ట్‌మెంట్ తరహాలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 430 చదరపు అడుగుల ప్లాట్ల కోసం రూ.25వేలు చెల్లించిన వారికి మొండిచేయి చూపారు. 2019లో వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్లపై పగపట్టింది. దీంతో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అంతేకాక రూ.25వేల చొప్పున మునిసిపాలిటీకి చెల్లించిన నగదును కూడా స్థానిక సంస్థలే వాడేసుకున్నాయి. దీంతో ఆరేళ్లుగా ప్లాట్ల కేటాయింపు జరగక, ఇటు డబ్బులు తిరిగి ఇవ్వక 240 మంది ఎదురుచూపులు చూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంపై వారంతా ఆశలు పెట్టుకున్నారు.
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అవస్థలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో టిడ్కో గృహ నిర్మాణ పథకం అప్పటి టీడీపీ ప్రభుత్వం అమలు చేసింది. చాలాచోట్ల నిర్మాణాలను దాదాపు పూర్తి చేసింది. 2018లో అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మార్కాపురంలో పనులు ప్రారంభించారు. సుమారు 65 శాతం మేర పూర్తయ్యాయి. కానీ వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో పథకాన్ని నిర్వీర్యం చేసింది. కనీస పనులు కూడా ముందుకు సాగలేదు. దీంతో సొంతింటి కల కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులు ఏళ్లపాటు ఎదురుచూపులు చూడాల్సి వచ్చింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిత తర్వాత పనులు వేగం పుంజుకున్నాయి. మార్కాపురంలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ప్లాట్లకు సంబంధించి 19 బ్లాకుల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. మొత్తం 912 మంది లబ్ధిదారులకు పాట్లను కేటాయించనున్నారు. వారిలో ఇప్పటి వరకు 295 మంది రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకా 617 మందికి ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉంది. కొద్ది నెలల్లో అవి కూడా పూర్తికానున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.
రూ.25 వేలు చెల్లించిన వారికి మొండిచేయి
2018లో అందరితోపాటు టిడ్కో సంస్థ చెప్పిన విధంగా 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లాట్లు కావాల్సిన వాళ్లు 240 మంది డీడీలు తీశారు. స్థానిక మునిసిపాలిటీకి చెందిన కమిషనర్ పేరునే 240 మంది సుమారు రూ.60 లక్షల మేర డీడీల రూపంలో చెల్లించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలోనే స్థలాభావం వలన 430 చదరపు అడుగుల ప్లాట్లు నిర్మించలేమని టిడ్కో సంస్థ తేల్చిచెప్పింది. ప్లాట్ల కేటాయింపు ఎలాగూ చేయలేదు కనీసం చెల్లించిన నగదునైనా తిరిగి ఇవ్వాలని గత ఆరు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ బాధితులు తిరుగుతున్నారు. గత వైసీపీ పాలకులు అసలు వారిని పట్టించుకున్న పాపానపోలేదు. ఈ ప్రభుత్వమైనా నగదును చెల్లించి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. ప్లాట్ల కేటాయింపును ఎలాగూ చేయలేదు కాబట్టి టిడ్కో సంస్థ నుంచి డబ్బులు రప్పించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.