Share News

అజెండాలో ఆరే!

ABN , Publish Date - Apr 23 , 2025 | 02:15 AM

టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న జిల్లా సమీక్షా మండలి (డీఆర్సీ) రెండో సమావేశం అజెండా పరిమితంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానమైనవిగా భావిస్తున్న ఆరు కీలక అంశాలపై చర్చించాలని ఇన్‌చార్జ్‌ మంత్రి నిర్ణయించారు.

అజెండాలో ఆరే!

నేడు డీఆర్సీ సమావేశం

పరిమిత అంశాలు

క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చిస్తేనే ఫలితం

ఉపాధి అక్రమార్కులపై నామమాత్రపు చర్యలు

కదలని సూర్యఘర్‌ పథకం

పశ్చిమాన దాహం కేకలు

వినతుల పరిష్కారంపై ప్రజల పెదవి విరుపు

గృహ నిర్మాణం అంతంతమాత్రమే

టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న జిల్లా సమీక్షా మండలి (డీఆర్సీ) రెండో సమావేశం అజెండా పరిమితంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానమైనవిగా భావిస్తున్న ఆరు కీలక అంశాలపై చర్చించాలని ఇన్‌చార్జ్‌ మంత్రి నిర్ణయించారు. అందులో ఉపాధి హామీ పథకం, తాగునీటి సరఫరా, గృహ నిర్మాణం, విద్య, ప్రధాన మంత్రి సూర్యఘర్‌ పథకాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రధానాంశంగా తీసుకొన్న ప్రజా విజ్ఞప్తుల పరిష్కారం (పీజీఆర్‌ఎస్‌) ఉన్నాయి.

ఒంగోలు, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాస్థాయిలో అత్యంత కీలకమైన డీఆర్సీ సమావేశం బుధవారం జరగనుంది. ఇన్‌చార్జ్‌ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రకాశం భవన్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో నిర్వహిస్తున్న ఈ సమావే శానికి కీలక ప్రజాప్రతినిధులు అయిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఆమే రకు వారందరికీ అధికారులు ఆహ్వానం పం పారు. అలాగే కార్పొరేషన్‌ చైర్మన్ల విషయంలో తర్జనభర్జన పడినప్పటికీ చివరకు వారికి కూడా సమాచారాన్ని పంపినట్లు తెలిసింది. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడ్డాక డీఆర్సీ జరగడం ఇది రెండోసారి. ఇన్‌చార్జ్‌ మంత్రుల నియామకం గత అక్టోబరులో జరగ్గా తొలి సమావేశాన్ని నవంబరు 4న నిర్వహించారు. మళ్లీ మూడు నెలలకే తదుపరి సమావేశాన్ని ఏర్పాటు చేయాలనున్నప్పటికీ రకరకాల కారణాలతో జాప్యమైంది. చివరకు ఐదున్నర నెలల అనంతరం బుధవారం నిర్వహిస్తున్నారు. ఆయా అంశాలను పరిశీలిస్తే.. జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు ప్రస్తుతం వేగం పుంజుకుంటున్నాయి. రోజువారీ లక్షా 20వేల మంది కూలీలు పనులకు వస్తుండగా పంచ ప్రాధాన్యాలుగా గుర్తించి పనులు చేయిస్తున్నారు. మూడు నెలలుగా పనులు చేసిన కూలీలకు రూ.25కోట్లకుపైగా వేతనాలతోపాటు మెటీరియల్‌ కోటా కింద చేసిన పనులకు సంబంధించి సుమారు రూ.132 కోట్లు పెండింగ్‌ బిల్లులు ఉండటం ఇబ్బందికరంగా మారింది.

విచారణపై చర్యలు ఏవీ?

గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాలో ఉపాధి హామీ పథకంలో అడ్డగోలుగా అవినీతి జరిగిందన్న ఫిర్యాదుతో కలెక్టర్‌ విచారణకు ఆదేశించిన విషయం విదితమే. త్రిసభ్య కమిటీ విచారణ చేసి అప్పటి పీడీగా పనిచేసిన కె.శీనారెడ్డి అక్రమాలు, అవినీతికి పాల్పడినట్లు తేల్చింది. ఆ విచారణ కమిటీ నివేదిక ఇచ్చి రెండు మాసాలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు చర్యలు కరువయ్యాయి. ఇతర ఉద్యోగులు, సిబ్బందిపై కూడా జిల్లాస్థాయిలో నామమాత్రపు చర్యలు తీసుకోవడంపై విమర్ళలు వస్తున్నాయి. ఆస్థాయిలో జరిగిన విచారణలోనే బాధ్యులపై చర్యలు సరిలేకపోవడంతో ప్రస్తుతం కూడా డ్వామా సిబ్బంది చాలాచోట్ల యథేచ్ఛగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు అధికంగా వస్తుండగా సోషల్‌ ఆడిట్‌, ప్రజావేదికలు తీరు అందుకు బలాన్ని ఇస్తున్నాయి.

అధికమైన తాగునీటి ఇక్కట్లు

జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పల్లె, పట్టణం తేడాలేకుండా వందలాది గ్రామాల్లో ప్రత్యేకించి పశ్చిమప్రాంతంలో నీటికోసం ప్రజలు తల్లడిల్లుతున్నారు. ప్రస్తుతం ఎనిమిది మండలాల్లోని 67 గ్రామాల్లో నీటి సరఫరా జరుగుతుండగా అంతకు రెట్టింపు ప్రాంతాలలో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఒంగోలు నగరంలో మూడు రోజులకు ఒకసారి అరకొరగా నీటి సరఫరా చేస్తుండగా పలు పట్టణాలలోనూ అవస్థలు తప్పడం లేదు.

ఒక్కశాతం మించలేదు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతగా పీఎం సూర్యఘర్‌ పఽథకాన్ని తీసుకొచ్చాయి. నియోజకవర్గానికి 10వేల వంతున 80వేల సోలార్‌ యూనిట్లు ఏర్పాటు లక్ష్యం కాగా ఇప్పటి వరకు అందులో ఒక్కశాతం మించి చేయలేదు. దీనిపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించకపోవడం కూడా పథకం ముందుకు సాగకపోవడానికి కారణమైంది. గృహ నిర్మాణాల పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక పెండింగ్‌లో ఉన్న 21వేల ఇళ్ల నిర్మాణాలపై దృష్టిపెట్టినా పదిశాతం మించి జరుగుతున్న పరిస్థితి లేదు. ఇక అత్యంత ప్రధానమైన ప్రజావిజ్ఞప్తులను పరిష్కరించేందుకు బాగానే జరుగుతున్నట్లు ఉన్నా ప్రభుత్వ సర్వేలో జిల్లాలో ప్రజాభిప్రాయం ప్రతికూలంగా ఉంది.


అధికార యంత్రాంగంపై తీవ్ర అసంతృప్తి

అధికారుల తీరుపై ప్రజల్లో అసంతృప్తి ఎక్కువగా ఉంది. ఈ అంశాలపై క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రజాప్రతినిధులు డీఆర్సీ సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇతర అంశాలను చూస్తే జిల్లాకు తలమానికమైన ఒంగోలు డెయిరీ పునరుద్ధరణ ప్రజల కోరిక కాగా ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. సంస్థ ఆస్తులు అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఏర్పడింది. వెలిగొండపై ప్రభుత్వం సీరియస్‌గానే ఉన్నప్పటికీ ఆ స్థాయిలో నిధులు మంజూరు కాక ప్రతికూల పరిస్థితి ఉంది. ట్రిపుల్‌ ఐటీ, యూనివర్సిటీ నిర్మాణాలు, చదలవాడ పశుక్షేత్రం అభివృద్ధి అంశాలు ఎవరికీ పట్టడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో సాగర్‌ కాలువలు, ఇతర నీటి వనరులపై చేసిన నిర్లక్ష్యంతో నీటిపారుదల ఇబ్బందిగా మారింది. ఈ అంశాలు అన్నింటిపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో వివిధ శాఖల పనితీరు కూడా ఏమాత్రం మెరుగుపడకపోగా అధ్వానంగా మారాయి.

Updated Date - Apr 23 , 2025 | 02:15 AM