Share News

సారు.. స్టేషన్‌కు రారు!

ABN , Publish Date - Jun 03 , 2025 | 01:51 AM

పోలీసు స్టేషన్‌కు రాకుండా బయట సెటిల్మెంట్‌లు చేసుకుంటూ తిరుగుతున్న కొనకనమిట్ల ఎస్‌ఐ రాజ్‌కుమార్‌పై వేటు పడింది. ఎస్పీ దామోదర్‌ సోమవారం అతనిని వీఆర్‌కు పిలిచారు.

సారు.. స్టేషన్‌కు రారు!

ఎస్‌ఐ కోసం మూడు గంటలు వేచి ఉన్న సీఐ

కొనకనమిట్ల ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ను వీఆర్‌కు పిలిచిన ఎస్పీ దామోదర్‌

ఒంగోలు క్రైం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : పోలీసు స్టేషన్‌కు రాకుండా బయట సెటిల్మెంట్‌లు చేసుకుంటూ తిరుగుతున్న కొనకనమిట్ల ఎస్‌ఐ రాజ్‌కుమార్‌పై వేటు పడింది. ఎస్పీ దామోదర్‌ సోమవారం అతనిని వీఆర్‌కు పిలిచారు. పోలీసు స్టేషన్‌ పరిధిలో ఎవరికైనా అత్యవసరమై ఫోన్‌ చేసినా ఎస్‌ఐ తీయని పరిస్థితి ఉందని కొనకొనమిట్ల మండల ప్రజలు అంటున్నారు. ఆయన బయట సివిల్‌ పంచాయితీలు చేయడం పరిపాటిగా మారిందని ఆరోపిస్తున్నారు. సార్‌.. ఎస్‌ఐ గారు ఎక్కడ ఉన్నారు..! అని నేరుగా కొందరు సీఐకి ఫోన్‌ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసేందుకు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వరరావు ఆదివారం కొనకనమిట్లకు వెళ్లారు. ఆయన మూడు గంటలు వేచి ఉన్నా ఎస్‌ఐ రాలేదు. దీంతో వెంటనే ఎస్పీకి సమాచారం ఇచ్చారు. గతంలోనూ ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీంతో వెంటనే సదరు ఎస్‌ఐని వీఆర్‌కు పిలిచి తన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఎస్పీ ఆదేశించారు.

Updated Date - Jun 03 , 2025 | 01:51 AM