గుండ్లకమ్మలో బయటపడిన శివలింగం, నంది
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:37 PM
జిల్లాలో సోమవారం ప్రాచీన శివలింగం, నంది విగ్రహాలు బయటపడ్డాయి. కురిచేడు మండలం ముష్ట్లగంగవరం గ్రామ సమీపంలో తంగిరాల వద్ద గుండ్లకమ్మ నది మధ్యన చట్టులో కనిపించాయి
కురిచేడు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం ప్రాచీన శివలింగం, నంది విగ్రహాలు బయటపడ్డాయి. కురిచేడు మండలం ముష్ట్లగంగవరం గ్రామ సమీపంలో తంగిరాల వద్ద గుండ్లకమ్మ నది మధ్యన చట్టులో కనిపించాయి. దీంతో కార్తీకమాసంలో శివుడు తమ గ్రామానికి వచ్చాడంటూ గ్రామస్థులు పూజలు చేస్తున్నారు. తంగిరాల గ్రామం పక్కనే గుండ్లకమ్మ నది ప్రవహిస్తుంది. అక్కడ రెండు పాయలుగా విడిపోయి మరలా కిందకు వెళ్ళి కలిసి ప్రవహిస్తుంది. రెండు పాయల మధ్య ఉన్న ఖాళీప్రదేశంలో గతంలో పెద్ద మట్టిచట్టు ఉంది. ఇటీవల తుఫాన్‌తో కురిసిన భారీవర్షాలకు గుండ్లకమ్మ నదికి పెద్ద ఎత్తున వరద వచ్చింది. నదిలో చాలా భాగం మట్టి కొట్టుకుపోయింది. దీంతో రాతిచట్టు బయటపడింది. సోమవారం చేపల వేటకు వెళ్ళిన జాలర్లకు అందులో శివలింగం, నంది కనపడ్డాయి. వెంటనే వారు గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి వెళ్లి, మా గ్రామాన్ని కాపాడటానికి శివయ్యే కార్తీకమాసంలో వచ్చాడంటూ పూజలు చేశారు. గుండ్లకమ్మ నదికి ఎంత ప్రవాహం వచ్చినా దెబ్బతినకుండా ఉండేలా ఆలయం నిర్మిస్తామని గ్రామస్థులు తెలిపారు.