భవిష్యత్‌కు భరోసా
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:53 AM
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లాలో పశ్చిమ ప్రాంతం.. ప్రత్యేకించి కనిగిరి నియోజకవర్గ భవిష్యత్తుకు భరోసా లభించింది. గత ఏప్రిల్‌లో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి కనిగిరి నియోజకవర్గంలోనే శ్రీకారం పలికారు. తాజాగా సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన పార్కుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ప్రారంభోత్సవం చేస్తున్నారు. రేపోమాపో ట్రిపుల్ ఐటీ భవనాల నిర్మాణానికి శంకుస్ధాపన జరగబోతోంది.
నిన్న బయోగ్యాస్ ప్లాంటు.. నేడు పారిశ్రామిక పార్కు
త్వరలో ట్రిపుల్ ఐటీ.. సోలార్ విద్యుత్ ప్రాజెక్టు
ఏవీ ఆగవు.. మరిన్ని వస్తాయన్న కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లాలో పశ్చిమ ప్రాంతం.. ప్రత్యేకించి కనిగిరి నియోజకవర్గ భవిష్యత్తుకు భరోసా లభించింది. గత ఏప్రిల్‌లో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి కనిగిరి నియోజకవర్గంలోనే శ్రీకారం పలికారు. తాజాగా సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన పార్కుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ప్రారంభోత్సవం చేస్తున్నారు. రేపోమాపో ట్రిపుల్ ఐటీ భవనాల నిర్మాణానికి శంకుస్ధాపన జరగబోతోంది. మరోవైపు సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల రాకకు రంగం సిద్ధమైంది. నడికుడి రైల్వేలైన్ నిర్మాణం ఊపందుకుంది. నియోజకవర్గం నుంచి వెళ్తూ రెండు జాతీయ రహదారులు నిర్మాణంలో ఉన్నాయి. వీటన్నింటికితోడు వెలిగొండ పూర్తయితే నియోజకవర్గం చివరి ప్రాంతం వరకు నీరు వస్తుందనే ఆశ ప్రజల్లో కలిగింది. దీనంతటికీ రాష్ట్రప్రభుత్వంలో కీలకంగా ఉన్న సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌లతో శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డికి సన్నిహిత సంబంధాలు దోహదం చేశాయి. అంతకుమించి వలసలకు నిలయమైన నియోజకవర్గ ప్రజల స్థితిగతులను ఎప్పటికప్పుడు వారికి వివరించి ఏచిన్న అవకాశం వచ్చినా ఆయా పథకాలు రాబట్టేందుకు ఉగ్ర అప్రమత్తంగా వ్యవహరించడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
నేటి కార్యక్రమం ఒక మచ్చుతునక
జిల్లాలోని పశ్చిమప్రాంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులోనూ కనిగిరి నియోజకవర్గానికి పెద్దపీట వేస్తున్నారు. అందుకు మంగళవారం జి.లింగన్నపాలెంలో పారిశ్రామిక పార్కు ప్రారంభోత్సవం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి పార్కులు నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికి రాష్ట్రంలో సుమారు 50కిపైగా ఎంఎస్‌ఎంఈ పార్కుల కోసం మౌలిక వసతుల కల్పన జరిగింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కనిగిరి నియోజకవర్గంలోనే కార్యక్రమం ఏర్పాటుకు నిర్ణయించడం విశేషం. ఇక్కడి నుంచి సుమారు 50 ఎంఎస్‌ఎంఈ పార్క్‌లను సీఎం వర్చువల్‌లో ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యే ఉగ్ర సహకారంతో 48 గంటల వ్యవధిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పార్కు వలన ఇప్పటికిప్పుడే భారీగా ఉపయోగం ఉంటుందని చెప్పలేం కాని భవిష్యత్తులో ఆప్రాంత అభివృద్ధి, ప్రజల ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు దోహదం చేస్తుందని సీనియర్ అధికారులు, విశ్లేషకులు చెప్తున్నారు. సింగరాయకొండ నుంచి రాయలసీమకు వెళ్లేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర రహదారికి అత్యంత చేరువలో ఈ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేమార్గంలో భాగంగా ఇక్కడకు చేరువలో ఉన్న పామూరులో రైల్వే రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. అలాగే రామాయపట్నం పోర్టు కూడా ఇక్కడ తయారైన పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఎంఎస్‌ఎంఈ పార్కులో స్థలాన్ని తక్కువ ధరకు పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు 20 ఏళ్ల క్రితం జాతీయ రహదారి పక్కన సింగరాయకొండ, గుల్లాపల్లి వద్ద పారిశ్రామిక పార్కుల ఏర్పాటుపై కూడా అప్పట్లో పెదవి విరిచిన వారు లేకపోలేదు. కానీ ఇప్పుడు గుళ్లాపల్లి పారిశ్రామిక కారిడార్ పరిశ్రమలకు నిలయంగా మారింది. సింగరాయకొండ వద్ద అప్పట్లో స్థలాలు పొందిన చిన్నచిన్న పారిశ్రామిక వేత్తలు కోటీశ్వరులయ్యారు.
మరిన్ని వస్తాయి : డాక్టర్ ఉగ్ర
కనిగిరి నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టిన ఏ పనులు ఆగవని, మరిన్ని ప్రాజెక్టులు రానున్నాయని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దూరదృష్టితో వెనుకబడిన కనిగిరి ప్రాంత అబివృద్ధికి ఇస్తున్న చేయూతకు యావత్తు ప్రజానీకం జేజేలు పలుకుతున్నదన్నారు. గత ఏప్రిల్‌లో మంత్రి లోకేష్ శంకుస్థాపన చేసిన రిలయన్స్ సంస్థ బయోగ్యాస్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. సీఎం చంద్రబాబునాయుడు జోక్యం చేసుకొని రిలయన్స్ సంస్థతో మాట్లాడి ఇక్కడ ఏర్పాటయ్యే ప్లాంట్ సామర్థ్యాన్ని పెంపొందించేలా చేశారని తెలిపారు. అదే తరహాలో పారిశ్రామిక పార్క్‌ను నియోజకవర్గ అభివృద్దికి దోహదపడేలా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. త్వరలో ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందని చెప్పారు. సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఒక సంస్థ ముందుకు వచ్చిందని వెల్లడించారు. ఆ సంస్థతో విద్యుత్‌శాఖ మంత్రి రవికుమార్ ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఇటు రైల్వే, అటు రోడ్డు రవాణా సౌకర్యాలు పెరిగినందున ఇతరత్రా అనుకూలమైన పరిశ్రమలను రప్పించేందుకు ప్రత్యేక చొరవ చూపుతానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే ఉగ్ర తెలిపారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు అనంతరం వెలిగొండ ద్వారా సాగునీరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు ఎలా అందించాలన్న అంశంపై ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. కనిగిరి ప్రాంత అభివృద్ధికి సీఎం ఇస్తున్న చేయూతకు రుణపడి ఉంటానని తెలిపారు.