భార్యను హింసించిన భర్త కోసం గాలింపు
ABN , Publish Date - Sep 18 , 2025 | 02:15 AM
తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో భార్యను కట్టేసి బెల్ట్‌తో బాదుతూ, కాళ్లతో తన్నుతూ క్రూరంగా హింసించిన భర్త కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మూడు బృందాలను రంగంలోకి దించారు.
మూడు పోలీసు బృందాల ఏర్పాటు
24 గంటల్లో పట్టుకుంటాం : సీఐ
నిందితుడికి సహకరించిన ఇద్దరు అదుపులోకి..
బాధితురాలి ఇంటికి వెళ్లి విచారించిన దర్శి డీఎస్పీ
తర్లుపాడు/పొదిలి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో భార్యను కట్టేసి బెల్ట్‌తో బాదుతూ, కాళ్లతో తన్నుతూ క్రూరంగా హింసించిన భర్త కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మూడు బృందాలను రంగంలోకి దించారు. నిందితుడిని 24 గంటల్లో పట్టుకుంటామని పొదిలి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన పొదిలిలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. నిందితుడికి సహకరించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదేశాల మేరకు దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ బ్రహ్మనాయుడు మంగళవారం రాత్రి బాధితురాలు భాగ్యలక్ష్మి ఇంటికి వెళ్లి విచారించారు. దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలను ఓదార్చారు. భాగ్యలక్ష్మి భర్త బాలాజీ, ఆయన రెండో భార్య పద్మావతి పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలు ప్రస్తుతం మార్కాపురం జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతోంది.