దివ్యాంగులకు స్కూటర్లు
ABN , Publish Date - Nov 26 , 2025 | 02:43 AM
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు తీపి కబురు చెప్పింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల స్కూటర్లను అందజేసింది. ఇప్పుడు మళ్లీ ఇవ్వాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది.
వంద శాతం రాయితీపై ఇవ్వనున్న ప్రభుత్వం
దరఖాస్తుకు ఈనెల 30 వరకూ గడువు
జిల్లాకు 80 మంజూరు
ఒంగోలు నగరం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు తీపి కబురు చెప్పింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల స్కూటర్లను అందజేసింది. ఇప్పుడు మళ్లీ ఇవ్వాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం దరఖాస్తులను ఆహ్వానించింది. తొలుత ఈనెల 25 వరకూ గడువు ఇచ్చింది. ఇప్పుడు దాన్ని ఈనెల 30వరకూ పొడిగించింది. ఒక్కో నియోజకవర్గానికి 10 చొప్పున జిల్లాకు 80 స్కూటర్లను ఇవ్వనుంది. 70శాతం కంటే పైన వికల త్వం కలిగి వాహనాన్ని నడపగలిగిన వారికి మాత్రమే వీటిని అందించనుంది. 8 నుంచి 45 సంవత్సరాలలోపు వయసు ఉన్న వారు మాత్రమే అర్హులు. దివ్యాంగులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను పంపుకోవాల్సి ఉంది. వైద్యారోగ్యశాఖ జారీ చేసిన సదరమ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఆధార్ కార్డు, పదో తరగతి ఉత్తీర్ణత, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు విద్యార్థులు అయితే బోన్‌ఫైడ్ సర్టిఫికెట్, స్వయం ఉపాధి, ఏదైనా సంస్థలో పనిచేస్తున్న వారు అయితే ఉపాధి ధ్రువపత్రాన్ని దరఖాస్తుకు జత చేయాలి. డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి. పదో తరగతి చదివి స్వయం ఉపాధి యూనిట్లు నడుపుతున్న, ఇతర విభాగాల్లో జీవనోపాధి పొందుతున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. జేసీ ఆధ్వర్యంలోని కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది.
డ్రైవింగ్ లైసెన్సులు లేక ఇబ్బందులు
ఉచితంగా మూడు చక్రాల మోటార్ వాహనాలను పొందాలనుకునే దివ్యాంగులకు డ్రైవింగ్ లైసెన్సును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో అనేక మంది లైసెన్సులు లేక దరఖాస్తు చేసుకునేందుకు కూడా అర్హత కోల్పోయారు. ఇదే విషయాన్ని దివ్యాంగుల యూనియన్ నాయకులు జేసీ గోపాలకృష్ట దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించారు. దివ్యాంగులకు లైసెన్సులు జారీ చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించారు. ఈనెల 21 నుంచి ఒంగోలులో దివ్యాంగులకు లెర్నింగ్ లైసెన్సు జారీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. రవాణా శాఖ అధికారులు వీరికి ప్రత్యేకంగా ఎల్‌ఎల్‌ఆర్ జారీచేయనున్నారు.