Share News

పొదుపు సొమ్ము స్వాహా

ABN , Publish Date - Oct 19 , 2025 | 01:41 AM

పొదుపు సొమ్మును గ్రూపు లీడర్‌ స్వాహా చేశారు. బ్యాంకులో తీసుకున్న రుణానికి సంబంధించి నెలవారీ సభ్యులు చెల్లించిన రూ.8.50లక్షలను సొంతానికి వాడేసు కున్నారు. లింగాలపాడులో చోటుచేసుకున్న ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత మహిళలు శనివారం కార్యాలయానికి చేరుకుని తమగోడు వెళ్లబోసుకున్నారు.

పొదుపు సొమ్ము స్వాహా

సభ్యులు రుణానికి చెల్లించిన రూ.8.50 లక్షలు సొంతానికి

వాడుకున్న గ్రూపు లీడర్‌

తాళ్లూరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : పొదుపు సొమ్మును గ్రూపు లీడర్‌ స్వాహా చేశారు. బ్యాంకులో తీసుకున్న రుణానికి సంబంధించి నెలవారీ సభ్యులు చెల్లించిన రూ.8.50లక్షలను సొంతానికి వాడేసు కున్నారు. లింగాలపాడులో చోటుచేసుకున్న ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత మహిళలు శనివారం కార్యాలయానికి చేరుకుని తమగోడు వెళ్లబోసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. లింగాలపాడు లోని గణేష్‌ గ్రూపు సభ్యులు తూర్పుగంగవరం యూనియన్‌ బ్యాంక్‌లో 2023 ఫిబ్ర వరిలో రూ.20 లక్షల రుణం తీసుకున్నారు. ప్రతినెలా ఒక్కో సభ్యురాలు చెల్లించాల్సిన సొమ్మును గ్రూపు లీడర్‌ అయిన, కొత్తపాలెంలో ఆశాకార్యకర్తగా పనిచేస్తున్న గోగుల ఏడుకొండలుకు అందజేశారు. 14 నెలలపాటు ఒక్కొక్కరు రూ.ఆరువేల వంతున పది మంది మహిళా సభ్యులు చెల్లించారు. మొత్తం 8లక్షల 40వేల రూపాయల్లో ఒక్క పైసా కూడా బ్యాంక్‌కు చెల్లించకుండా గ్రూపు లీడర్‌ సొంతానికి వాడుకున్నారు. గ్రూపు మహిళలు బాకీ చెల్లించకపోవడంతో గతనెలలో బ్యాంక్‌ మేనేజర్‌ గణేష్‌ వారి వ్యక్తిగత బ్యాంక్‌ అకౌంట్‌లకు మెమో పెట్టారు. దీంతో విషయం వెలుగు చూసింది. ఆగ్రూపు మహిళలు ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వరరెడ్డిలు గ్రూపు లీడర్‌ ఏడుకొండలును పిలిపించి బాధిత మహిళల సమక్షంలో నిలదీయగా తప్పు చేశానని అంగీకరించారు. ఆ డబ్బులు వారికి చెల్లిస్తానని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధిత పొదుపు మహిళలు కోరుతున్నారు.

Updated Date - Oct 19 , 2025 | 01:41 AM