Share News

పుల్లలచెరువు ఎస్‌ఐ నుంచి కాపాడండి

ABN , Publish Date - Aug 11 , 2025 | 11:35 PM

పుల్లలచెరువు ఎస్‌ఐ నుంచి తనను కాపాడాలని కోరుతూ బాధితుడు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. రెండేళ్ల కిందట అమ్మిన స్థలం ధర ఇప్పుడు తగ్గిందని, దానిని కొన్న వ్యక్తి నష్టపోయారు..

పుల్లలచెరువు ఎస్‌ఐ నుంచి కాపాడండి
ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న బాధితుడు అప్పారావు

మీకోసంలో ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు

విచారణకు ఆదేశించిన దామోదర్‌

త్రిపురాంతకం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : పుల్లలచెరువు ఎస్‌ఐ నుంచి తనను కాపాడాలని కోరుతూ బాధితుడు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. రెండేళ్ల కిందట అమ్మిన స్థలం ధర ఇప్పుడు తగ్గిందని, దానిని కొన్న వ్యక్తి నష్టపోయారు.. అతనికి ఇంకా నువ్వు బాకీ ఉన్నావని బెదిరించి తనవద్ద రూ.35లక్షలకు ప్రామిసరీ నోటు రాయించిన ఎస్సై సంపత్‌కుమార్‌ బారి నుంచి తనను కాపాడాలని ఎర్రగొండపాలెం మండలం కొలుకుల గ్రామానికి చెందిన యక్కలి అప్పారావు కోరారు. ఒంగోలులో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో ఎస్పీ దామోదర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. పుల్లలచెరువుకు చెందిన వ్యాపారి గజ్వల్లి భాస్కరరావుకు 2023 మే25న తాను వైపాలెంలో 22 సెంట్ల స్థలం అమ్మానని అప్పుడే రిజిష్ట్రేషన్‌ జరిగిందని బాధితుడు పేర్కొన్నారు. ఇప్పుడు దాని రేటు తగ్గిందని కొన్నప్పుడు ఇచ్చిన డబ్బుకు వడ్డీ కడితే ఇంకా రూ.35లక్షల వరకు వస్తాయని ఇప్పుడు భాస్కర్‌ ఎస్సై సంపత్‌కుమార్‌తో కలిసి తనను ఇబ్బంది పెట్టారని చెప్పారు. కానిస్టేబుల్‌ కొలుకుల వచ్చి తనను పుల్లలచెరువుకు తీసుకెళ్లారని అక్కడ పోలీ్‌సస్టేషన్‌లో తనను సాయంత్రం వరకు ఉంచి భౌతిక దాడి చేసి హింసకు గురిచేశారన్నారు. ఆ సమయంలో భాస్కర్‌ను ఎదురుగా ఉంచి తన నుంచి బలవంతంగా వేరువేరు తేదీలతో (జూలై 24, 25, 26) విడివిడిగా రూ.35లక్షలకు మూడు ప్రామిసరీ నోట్లు తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారని వాపోయారు. ఈ విషయం ఎక్కడైనా చెపితే కేసు కట్టి జైలుకు పంపుతానని బెదిరిస్తున్నారని, ఎస్‌ఐ బారి నుంచి కాపాడి తన ప్రామిసరీ నోట్లు తనకు ఇప్పించాలని బాధితుడు ఎస్పీని వేడుకొన్నారు. ఈ విషయంపై స్పందించిన ఎస్పీ వెంటనే విచారణ జరిపి 15 రోజుల్లోగా ఈ ఫిర్యాదుపై నివేదిక ఇవ్వాలని మార్కాపురం డీఎస్పీ నాగారాజును ఆదేశించారు.

Updated Date - Aug 11 , 2025 | 11:35 PM