Share News

ఇసుక ప్రియం

ABN , Publish Date - Sep 30 , 2025 | 01:26 AM

ఒంగోలులో ఒక్కసారిగా ఇసుక ధర టన్నుకు రూ.300 పెరిగింది. దీంతో నగరంలో కొంతమంది భవన నిర్మాణాలను నిలిపివేశారు. బేల్దారి పనులు చేసేవారికి సైతం పనులు లేకుండాపోయాయి. జిల్లాలో ఇసుక లభ్యత ఎక్కువగా లేదు. నెల్లూరు నుంచి తేవాల్సి వస్తోంది.

ఇసుక ప్రియం

కృత్రిమ కొరత సృష్టిస్తున్న వాహన యజమానులు

టన్నుకు రూ.300 పెంచి విక్రయం

భవన నిర్మాణ రంగంపై భారం

పట్టించుకోని అధికార యంత్రాంగం

ఒంగోలులో ఒక్కసారిగా ఇసుక ధర టన్నుకు రూ.300 పెరిగింది. దీంతో నగరంలో కొంతమంది భవన నిర్మాణాలను నిలిపివేశారు. బేల్దారి పనులు చేసేవారికి సైతం పనులు లేకుండాపోయాయి. జిల్లాలో ఇసుక లభ్యత ఎక్కువగా లేదు. నెల్లూరు నుంచి తేవాల్సి వస్తోంది. దానికి రవాణా, లోడింగ్‌ చార్జీలు మాత్రమే తీసుకొని విక్రయిస్తుంటారు. రెండు వారాల క్రితం వరకూ టన్ను ఇసుక కేవలం రూ.500కు అందుబాటులో ఉండేది. ఈ మేరకు టిప్పరు (40 టన్నులు) ఇసుకను రూ.20వేలకు సరఫరా చేసేవారు. ఇటీవల ఒక్కసారిగా టన్ను రూ.800కు పెంచి టిప్పరుకు రూ.32వేలు వసూలు చేస్తున్నారు. దీంతో ఇసుక బరువై నిర్మాణదారులు ఇబ్బందిపడుతున్నారు.

ఒంగోలు క్రైం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఇసుక ధర ఒక్కసారిగా పెరగడంతో నిర్మాణరంగంపై భారం పడింది. దీంతో బేల్దారి కూలీలకు పనులు దొరకడం లేదు. ఇసుక ఇటీవలి వరకు టన్ను రూ.500కు విక్రయించేవారు. దీంతో నిర్మాణదారులు ఉత్సాహంగా భవనాలు నిర్మిస్తున్నారు. అయితే రెండు వారాల నుంచి టన్ను ధర అదనంగా రూ.300కుపైనే పెంచేయడంతో వారిపై పిడుగుపడింది. పరిమితికి మించిన రవాణా అంటూ యంత్రాంగం దాడులు, ప్రైవేటు సైన్యం వసూళ్లతోనే ధర పెరిగిందని సమాచారం. సాధారణంగా నెల్లూరు నుంచి 30 నుంచి 40 టన్నులు రవాణా చేస్తేనే తమకు గిట్టుబాటు అవుతుందని టిప్పరు యజమానులు చెబుతున్నారు. అలా రవాణా చేస్తేనే ఒంగోలుకు టన్ను ఇసుక రూ.500కు సరఫరా చేయగలమని అంటున్నారు. వీరు భవన యజమానుల పేరుతో ఇసుక రవాణా చేసుకుంటున్నారు. అయితే ఓవర్‌ లోడ్‌ పేరుతో ఇటీవల రవాణా, మైనింగ్‌ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారని టిప్పర్‌ యజమానులు వాపోతున్నారు. నిబంధనల ప్రకారం టిప్పరులో 20 టన్నులు మాత్రమే రవాణా చేయాల్సి ఉంది. అయితే 30 నుంచి 40 టన్నులు ఇసుక రవాణా చేయడం నిబంధనలకు విరుద్ధమని పోలీసు, మైనింగ్‌ అధికారులు చెబుతున్నారు. ఈ నేపఽథ్యంలో టిప్పర్లపై కేసులు నమోదు చేయడంతో నెల్లూరుకు చెందిన టిప్పర్ల యజమానులు రవాణాను తగ్గించివేశారు. అదేక్ర మంలో ఒంగోలుకు చెందిన కొంతమంది టిప్పరు యజమా నులు ఇసుక రవాణాను వదిలేసి గ్రావెల్‌ తరలిస్తున్నారు. ఇలా అధికారులు ఓవర్‌ లోడ్‌ అని వేధిస్తుండగా కొంతమంది ప్రైవేటు సైన్యం తమకు టన్నుకు రూ.150 చెల్లించకపోతే కేసులు నమోదు చేయిస్తామని బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. దీంతో రెండు వారాలుగా నెల్లూరు నుంచి ఇసుక రవాణా చేయడం టిప్పర్ల యజమానులు ఆపేశారు. కొంతమంది మాత్రం ప్రైవేటు సైన్యంకు టన్నుకు రూ.150 చెల్లించి అదనపు ఖర్చులు వేసుకొని టన్ను రూ.800 నుంచి రూ.850 వరకు విక్రయిస్తున్నారు.

కృత్రిమ కొరత సృష్టిస్తున్న టిప్పర్‌ యజమానులు

ప్రభుత్వం అధికారికంగా ఒంగోలులో ఏర్పాటు చేసిన స్టాక్‌ పాయింట్‌లో టన్ను ఇసుక ధర రూ.980గా ఉంది. భవన నిర్మాణదారుడు నేరుగా నెల్లూరు నుంచి ఇసుకను తెచ్చుకునే వెసులుబాటు ఉంది. దాన్ని ఆసరా చేసుకొని టిప్పర్‌ల వారు ఇసుకను అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. వారివద్దే తక్కువ ధరకు లభిస్తుండటంతో నిర్మాణదారులు స్టాక్‌ పాయింట్‌లో కాకుండా బయటే కొనుగోలు చేస్తున్నారు. రెండు వారాల క్రితం వరకూ టిప్పర్‌ల యజమానులు టన్ను ఇసుకను రూ.500కు అమ్మారు. ఇప్పుడు ఒక్కసారిగా టన్ను ధర రూ.800కు పెంచేశారు. తీవ్రమైన వర్షాల కారణంగా పెన్నా నదిలో ఇసుక లభ్యం కావడం లేదని చెబుతున్నారు. అలాగే ప్రైవేటు సైన్యానికి రూ.150తోపాటు మరో రూ.150 అధికారులకు మామూళ్లు ఇవ్వాల్సి వస్తుందంటున్నారు. అందుకే టన్ను రూ.800కు విక్రయిస్తున్నామని బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. పనిలో పనిగా కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచి విక్రయిస్తున్నారు.

Updated Date - Sep 30 , 2025 | 01:26 AM