గ్రానైట్ వ్యర్థాలతో నిండిన సనకొండ
ABN , Publish Date - Oct 13 , 2025 | 12:52 AM
మండల పరిధిలో ఉన్న సనకొండ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములలో గ్రానైట్ ప్యాక్టరీల వ్యర్థాలను పెద్దఎత్తున పడవేస్తున్నారు.
బల్లికురవ, అక్టోబరు12(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలో ఉన్న సనకొండ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములలో గ్రానైట్ ప్యాక్టరీల వ్యర్థాలను పెద్దఎత్తున పడవేస్తున్నారు. దీంతో కొండ ప్రాంతానికి వెళ్లాలంటేనే రైతులు భయపడుతున్నారు. రోడ్డును సైతం వ్యర్థాలతో నింపుతుండడంతో అది కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. బల్లికురవ మండలం గుంటుపల్లి, మార్టురు మండలం నాగరాజుపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సనకొండ భూములలో కొందరు రెండు మండలాల్లో ఉన్న గ్రానైట్ ఫ్యాక్లరీల నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున డంపింగ్ చేస్తున్నారు. దీంతో కొండ భూములు మొత్తం వ్యర్థాలకు నిలయంగా మారాయి. బల్లికురవ వైపు నుంచి కొండమీదగా మార్టూరు, నాగరాజుపల్లి వెళ్లే రోడ్లు సైతం వ్యర్థాలు నిండాయి. ఫ్యాక్టరీలలో పనికి రాని రాళ్లను రాత్రుళ్లు తీసుకు వచ్చి రోడ్ల వెంబడి, ప్రభుత్వ భూమిలో వేస్తున్నారని వీటి వలన పంట భూములకు వెళ్లే రైతులు సైతం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దూర ప్రాంతాలలో ఫ్యాక్టరీలు నిర్వహించే వారు సైతం వాహనాలను పెట్టి మరి వ్యర్ధాలను తీసుకు వచ్చి పడేస్తున్నారని రైతులు వాపోతున్నారు. అధికారులు వెంటనే నిఘా పెట్టి వ్యర్థాలను పడేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని లేకుంటే ముందు మందు సనకొండ భూములు వ్యర్ధాలకు చిరునామాగా మారుతుందని రైతులు పేర్కొంటున్నారు.