Share News

రెండో రోజూ అదే జోష్‌

ABN , Publish Date - May 29 , 2025 | 01:44 AM

తెలుగుదేశం పార్టీ కడప సమీపంలో నిర్వహిస్తున్న మహానాడుకు రెండో రోజైన బుధవారం కూడా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఉత్సాహంగా పార్టీ నాయకులు తరలి వెళ్లారు. తొలిరోజైన మంగళవారం అన్ని నియోజకవర్గాల పరిధిలోని మండలాలు, పట్టణాల నుంచి ముఖ్యమైన నాయకులు వెళ్లారు.

రెండో రోజూ అదే జోష్‌
టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు మరోసారి ఎన్నికైన సందర్భంగా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న జిల్లాలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నేతలు

పలు ప్రాంతాల నుంచి ఉత్సాహంగా మహానాడుకు టీడీపీ నాయకులు

నేడు ముగింపు, కడప సమీపంలో సభ

జిల్లా నుంచి భారీగా బయల్దేరిన శ్రేణులు

ఒంగోలు, మే 28 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ కడప సమీపంలో నిర్వహిస్తున్న మహానాడుకు రెండో రోజైన బుధవారం కూడా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఉత్సాహంగా పార్టీ నాయకులు తరలి వెళ్లారు. తొలిరోజైన మంగళవారం అన్ని నియోజకవర్గాల పరిధిలోని మండలాలు, పట్టణాల నుంచి ముఖ్యమైన నాయకులు వెళ్లారు. అలా వందలాది వాహనాల్లో వెళ్లిన వారిలో కొందరు అక్కడే ఉండగా మరికొం దరు రాత్రికి తిరిగి వచ్చారు. అదేసమయం లో రెండో రోజు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మరికొందరు మహానాడుకు వెళ్లారు. పార్టీశ్రేణులు ఊహించిన దానికన్నా బాగా మహానాడు జరుగుతున్నట్లు తెలుస్తుండటంతో జిల్లాలోని పలుప్రాంతాల నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సాహంతో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. జిల్లాకుచెందిన మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌.విజయకుమార్‌, డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, కందుల నారాయణరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఎరిక్షన్‌బాబు, గొట్టిపాటి లక్ష్మి, పార్లమెంట్‌ అధ్యక్షుడు, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ లాంటి వారు కడపలోనే బసచేసి రెండవరోజు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సభల నిర్వహణలో అధిష్ఠానం తరఫున ఏర్పాట్లలో క్రియాశీలకంగా ఉన్న యువనేత దామచర్ల సత్య కొండపి నియోజకవర్గం నుంచి దాదాపు 50మందిని పిలిపించుకొని భోజన, వసతి సౌకర్యాల ఏర్పాట్లలో నిమగ్నమై పనిచేస్తున్నారు. కాగా మహానాడు గురువారంతో ముగియనుంది. ముగింపు సందర్భంగా భారీ బహిరంగసభను నిర్వహిస్తున్నారు. ఆ సభకు జిల్లా నుంచి కూడా పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలు వెళ్ళనున్నారు. ప్రధానంగా పశ్చిమప్రాంత నియోజకవర్గాల నుంచి అధికంగా కదులుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఆయా ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు నేతృత్వంలో బస్సులు, ఇతర వాహనలను కూడా ఏర్పాటుచేశారు. ఇదిలాఉండగా మహానాడుకు వెళ్లిన జిల్లా నేతలు విరాళాలను కూడా అధిష్ఠానానికి అందజేస్తున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ తొలిరోజున రూ.25లక్షల చెక్కును అందజేయగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఏకంగా కోటిన్నర రూపాయాల విరాళాన్ని ప్రకటించారు. దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జీ గొట్టిపాటి లక్ష్మీ, లలిత్‌సాగర్‌లు రూ.5లక్షలు అందజేశారు. మరికొంతమంది అలా ఇచ్చినట్లు సమాచారం.

Updated Date - May 30 , 2025 | 03:05 PM