‘తల్లికి వందనం’ అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 16 , 2025 | 10:44 PM
తల్లికి వందనం పథకం కింద ఆర్థిక ప్రయోజనం దక్కలేదంటూ వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : తల్లికి వందనం పథకం కింద ఆర్థిక ప్రయోజనం దక్కలేదంటూ వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి సోమవారంసాయంత్రం జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. తల్లికి వందనం లబ్ధిదారులు, అనర్హుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏయే కారణాల వల్ల ఆర్థిక ప్రయోజనం దక్కలేదో తల్లిదండ్రులకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఉపాధి పథకంలో వ్యవసాయ, అనుబంధ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఫారంఫాండ్స్ నిర్మాణాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. కమ్యూనిటీ ఇంకుడు గుంతలను కూడా తవ్వించాలని చెప్పారు. రోజువారీ ఉపాధి సగటు కూలీ రూ.251 ఉందని, దీనిని రూ.275కు తగ్గకుండా చూడాలన్నారు. ఉద్యానవనశాఖ ద్వారా మొక్కల పెంపకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వకార్యాలయాలు, పాఠశాలలు అంగన్‌వాడీ కేంద్రాలు, ఆస్పత్రులు, వసతిగృహాల్లో విరివిగా మొక్కలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న గోకులం షెడ్ల నిర్మాణ బిల్లులు వారం రోజుల్లో జమవుతాయని కలెక్టర్ తెలిపారు. జేసీ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో పది లక్షల మందితో యోగాసనాలు చేసేలా ఇస్తున్న శిక్షణలో రిజస్ట్రేషన్ చేయించుకున్న అందరూ పాల్గొనే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు జోస్‌ఫకుమార్, చిరంజీవి, శ్రీనివాస ప్రసాద్, డాక్టర్ వెంకటేశ్వర్లు, గొట్టిపాటి వెంకటనాయుడు, వెంకటేశ్వరరావు, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.