తల్లికి వందనం పెండింగ్ ఈకేవైసీని నేటితో పూర్తిచేయాలి
ABN , Publish Date - Jun 30 , 2025 | 11:00 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న తల్లికివందనంలో భాగంగా పెండింగ్ ఈకేవైసీని మంగళవారం సాయంత్రంలోపు పూర్తిచేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు
కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశం
8న 750 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు ఇరువురు మంత్రులు రాక
ఒంగోలు కలెక్టరేట్, జూన్(ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న తల్లికివందనంలో భాగంగా పెండింగ్ ఈకేవైసీని మంగళవారం సాయంత్రంలోపు పూర్తిచేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలతో సోమవారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. అర్హులందరికీ ఈ పథకం కింద ప్రయోజనం దక్కడమే లక్ష్యంగా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఈ నేపథ్యంలో ఈకేవైసీ పూర్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని చెప్పారు. ఈనెల 5వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. పీ-4పథకంలో భాగంగా బంగారు కుటుంబాల అవసరాలను గుర్తించాలని, అదే సమయంలో వీటికి అండగా నిలిచేలా మార్గదర్శకులను కూడా గుర్తించాలని చెప్పారు. ఫారంపాండ్స్, ఫిషింగ్ పాండ్స్, కంపోస్టు పిట్స్ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, అందులో భాగంగా జిల్లాలో 750 ఎకరాలలో మొక్కలు నాటాలని చెప్పారు. ఆ రోజున ఈ కార్యక్రమానికి జిల్లాఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్రసాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ స్వామి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. జూలైలో ఉపాధి పథకం కింద 20 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సగటు వేతనం రూ.251 లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అదికారులు చిరంజీవి, జోస్‌ఫకుమార్, శ్రీనివాసప్రసాద్ తదితరులు ఉన్నారు.