Share News

సరస్వతీ నమస్తుభ్యం

ABN , Publish Date - Sep 29 , 2025 | 10:28 PM

దసరా శరన్ననవరాత్రులు పురస్కరించుకుని మూలనక్షత్రం సందర్భంగా మార్కాపురం పట్టణంలో అమ్మవార్లు సోమవారం వివిధ అలంరణలో భక్తలకు దర్శనం ఇచ్చారు. అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు రాజ్యలక్ష్మీ అమ్మవారి మూలవిరాట్‌ ఉత్సవ మూర్తికి అభిషేకాలు, అలంకరణ నిర్వహించారు.

సరస్వతీ నమస్తుభ్యం
విద్యాలక్ష్మిగా రాజ్యలక్ష్మి

మార్కాపురం వన్‌టౌన్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): దసరా శరన్ననవరాత్రులు పురస్కరించుకుని మూలనక్షత్రం సందర్భంగా మార్కాపురం పట్టణంలో అమ్మవార్లు సోమవారం వివిధ అలంరణలో భక్తలకు దర్శనం ఇచ్చారు. అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు రాజ్యలక్ష్మీ అమ్మవారి మూలవిరాట్‌ ఉత్సవ మూర్తికి అభిషేకాలు, అలంకరణ నిర్వహించారు. స్థానిక శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో రాజ్యలక్ష్మీ అమ్మవారు విద్యాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈవో గొలమారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు పర్యవేక్షించారు. మార్కండేశ్వర స్వామి ఆలయంలో జగదాంబ కాళరాత్రి అలంకారంలో దర్శనం ఇచ్చారు. ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలను పర్యవేక్షించి భక్తులకు సౌకర్యాలు కల్పించారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత సరస్వతి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బొంతల పుల్లారావు, కార్యదర్శి వక్కలగడ్డ సురేశ్‌ కుమార్‌, కోశాధికారి చక్కా మాలకొండ చిన్న నరసింహారావు కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద పంపిణీ నిర్వహించారు. వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. జవహర్‌ నగర్‌లోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో విద్యాలక్ష్మీ అలంకారంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు.

త్రిపురాంతకం : త్రిపురాంతకేశ్వరస్వామి శ్రీమత్‌ బాలాత్రిపురసుందరీదేవి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం మూలానక్షత్రం కావడంతో విశిష్టత కారణగా భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సరస్వతీదేవి పూజ జరగడంతో పలువురు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. సోమవారం కాళరాత్రి అమ్మవారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

బాలాత్రిపురసుందరీదేవికి టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పట్టు వస్త్రాలను సమర్పించి పూజలో పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. సరస్వతీ పూజ చేసిన భక్తులు చాలామంది వారి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో అనిల్‌కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ చేకూరి సుబ్బారావు పాల్గొన్నారు.

గిద్దలూరు : గిద్దలూరులో దసరా శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని సోమవారం సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా అమ్మవారిశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీ నవోదయ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు చీతిరాల ప్రసాద్‌ అక్షరాభ్యాసం చేస్తున్న చిన్నారులకు విద్యాసామాగ్రిని అందించారు. రామాలయం నుంచి అమ్మవారిశాల వరకు కన్యకలు కలిశాలను ఎత్తుకుని రాగా అమ్మవారికి ఆ నీటితో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉభయదాతలు ప్రత్యేక పూజలు చేశారు. షరాఫ్‌ బజారులోని శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వారు రామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

రాచర్ల : అమ్మవారు సోమవారం సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పట్టాభి రామాలయంలో అమ్మవారిని సరస్వతీ దేవి అలంకరించి పూజలు నిర్వహించారు.

కంభం : శ్రీ కోట సత్యమాంబ దేవి అమ్మవారు శ్రీ సరస్వతి దేవిగా, వాసవీ మాత సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు.

Updated Date - Sep 29 , 2025 | 10:28 PM