Share News

ఇటుకల ట్రాక్టర్‌ ఢీకొని సేల్స్‌ మేనేజర్‌ దుర్మరణం

ABN , Publish Date - May 16 , 2025 | 12:00 AM

ఇటుకలు లోడుతో వెళుతున్న ట్రాక్టర్‌ ఢీకొనడంతో ట్రాక్టర్‌ షోరూంలో సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న బోగిరెడ్డి వెంకటనారపరెడ్డి(58) దుర్మరణం చెందారు. ఈ ఘటన ఒంగోలులోని బృందావన్‌ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలోని హైవేపై గురువారం మధ్యాహ్నం జరిగింది.

ఇటుకల ట్రాక్టర్‌ ఢీకొని సేల్స్‌ మేనేజర్‌ దుర్మరణం
ప్రమాదస్థలంలో వివరాలుసేకరిస్తున్న పోలీసులు

నలుగురు కూలీలకు గాయాలు

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ దామోదర్‌

ఒంగోలు క్రైం, మే 15(ఆంధ్రజ్యోతి): ఇటుకలు లోడుతో వెళుతున్న ట్రాక్టర్‌ ఢీకొనడంతో ట్రాక్టర్‌ షోరూంలో సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న బోగిరెడ్డి వెంకటనారపరెడ్డి(58) దుర్మరణం చెందారు. ఈ ఘటన ఒంగోలులోని బృందావన్‌ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలోని హైవేపై గురువారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలేనికి చెందిన వెంకటనారపరెడ్డి త్రోవగుంట సమీపంలోని ఓ ట్రాక్టర్‌ షోరూంలో సేల్స్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆయన తన విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతుండగా వెనుక వైపు నుంచి ఇటుకల లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ వేగంగా ఢీకొంది. ట్రాక్టర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వాహనంపై నడపడంతో ద్విచక్రవాహనంపై నుంచి వెంకటనారపరెడ్డి రోడ్డు మీద పడ్డారు. అంతేగాకుండా ట్రాక్టర్‌ టైర్లు అతనిపై ఎక్కాయి. దీంతో వెంకటనారపరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్‌ అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి ట్రక్కు పక్కకు తిరగబడింది. దీంతో ట్రక్కు మీద ప్రయాణిస్తున్న నలుగురు కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. క్షతగ్రాతులను 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించారు. వెంకటనారపరెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు ఆర్మీలో ఉద్యోగం చేస్తుండగా, మరో కుమారుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. కాగా అదేసమయంలో ఈ మార్గంలో వస్తున్న ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ ఈ రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించి అక్కడ ఆగి పరిశీలించారు. వెంటనే మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించాలని పోలీసులను ఆదేశించారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.

Updated Date - May 16 , 2025 | 12:00 AM