సాగర్ నీటి పంపిణీలో మతలబు
ABN , Publish Date - Oct 04 , 2025 | 01:04 AM
సాగర్ కాలువలకు నీటి పంపిణీలో చివరి ప్రాం తాలకు అన్యాయం జరుగు తోంది. రీడింగ్‌లో తేడాలతో జిల్లాకు తక్కువ నీరు విడుదల అవుతున్నప్పటికీ ఎక్కువ సరఫరా అవుతున్నట్లు చూపుతోంది. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
రీడింగ్‌లో భారీగా తేడాలు
వస్తున్న దానికంటే అధికంగా చూపుతున్న వైనం
ఆయకట్టు రైతులకు అన్యాయం
దర్శి, అక్టోబరు 3 (ఆంధ్ర జ్యోతి) : సాగర్ కాలువలకు నీటి పంపిణీలో చివరి ప్రాం తాలకు అన్యాయం జరుగు తోంది. రీడింగ్‌లో తేడాలతో జిల్లాకు తక్కువ నీరు విడుదల అవుతున్నప్పటికీ ఎక్కువ సరఫరా అవుతున్నట్లు చూపుతోంది. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సాగర్ ప్రధాన కాలువ 85/3వ మైలు రెగ్యులేటర్ వద్ద పూడిక పేరుకుపోవడంతోపాటు రీడింగ్ పట్టికలో తేడా ఉన్నందున నీటి లెక్కల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దర్శి బ్రాంచ్ కాలువ వద్ద రీడింగ్‌లోనూ తేడాలు ఉన్నాయి. ఈ కారణంగా సుమారు 400 క్యూసెక్కుల నీరు తక్కువగా వస్తోంది. దీంతో రైతులకు నష్టం జరుగుతోంది. ప్రస్తుతం రీడింగ్ ప్రకారం సాగర్ ప్రధా న కాలువ 85/3వ మైలు (ప్రకా శం సరిహద్దు) వద్ద 2,740 క్యూసెక్కులు వస్తోంది. అయితే వాస్తవానికి అక్కడ 2,400 మాత్రమే సరఫరా అవుతోంది. అక్కడి నుంచి దర్శి బ్రాంచ్ కాలువ హెడ్‌కు వచ్చేసరికి 1,850 క్యూసెక్కులు సరఫరా అవుతున్నట్లు రీడింగ్ చూపుతోంది. కానీ అక్కడ 300 క్యూసెక్కులు తక్కువగా వస్తోంది. ఒంగోలు బ్రాంచ్ కాలువ హెడ్ వద్దకు వచ్చే సరికి కేవలం 750 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతున్నట్లు చెప్తున్నారు. 85/3వ మైలు నుంచి ఓబీసీ హెడ్ వరకు ఎక్కువ నీరు వాడుతున్నట్లు తప్పుడు తడకలుగా ఉన్న రీడింగ్‌లు చెబుతున్నాయి. వాస్తవంగా ఆ రీడింగ్‌లు సక్రమంగా ఉంటే ఒంగోలు బ్రాంచ్ కాలువకు అధికారులు అన్యాయం చేసినట్లుగా భావించాల్సి ఉంటుంది.
బయటకు చెప్పేందుకు సాహసించని అధికారులు
వాస్తవంగా అక్కడ రీడింగ్‌లు తప్పుగా ఉన్న విషయాన్ని స్ధానిక అధికారులు బయటకు చెప్పలేకపోతున్నారు. ఈవిషయం బయటకు చెబితే గుంటూరు జిల్లా ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఎంతోకాలంగా మిన్నకుండిపోయారు. రీడింగ్‌ల తప్పులను సరిచేసే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోలేదు. హైదరాబాద్‌లో అకౌంటిక్ డ్రాపులర్ కరెంట్ ప్రొఫైలర్‌తో రీడింగ్‌ను చెక్‌చేస్తే లోపాలు బహిర్గతమవుతాయి. ఆతర్వాత గేజింగ్ మీటర్ లెవల్స్ సరిచేస్తే రీడింగ్స్ సక్రమంగా వస్తాయి. లెవల్స్ సరిచేయాలంటే ఇప్పుడు సాధ్యం కావడం లేదు. నీరు విడుదల కాని సమయంలో పేరుకుపోయిన పూడికతీసి సరిచేయాల్సి ఉంది. దీంతో అధికారులు మిన్నకుండిపోయారు. కనీసం ఇప్పుడు తనిఖీ చేసి తేడాలను గుర్తిస్తే కొంతమేరకు తప్పును సరిచేసే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు ఈవిషయాన్ని గుర్తించి రీడింగ్స్‌లో తేడాలను సరిచేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.