ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవరు మృతి
ABN , Publish Date - Jun 17 , 2025 | 11:56 PM
ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడి ఒకరు మృతి చెందారు. ఈఘటన మంగళవారం మధ్యాహ్నం పీసీపల్లిమండలంలోని భట్టుపల్లి సమీపంలో చోటుచేసుకుంది.
పీసీపల్లి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడి ఒకరు మృతి చెందారు. ఈఘటన మంగళవారం మధ్యాహ్నం మండలంలోని భట్టుపల్లి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పెద్దన్నపల్లి గ్రామానికి చెందిన అరటివేముల మహే్‌షకు భార్య స్రవంతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యవసాయంతో పాటు తాపీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల పీసీపల్లిలో కొత్త ఇల్లు నిర్మించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఇనుపచువ్వను తెచ్చేందుకు తన సొంత ట్రాక్టర్‌తో మంగళవారం కనిగిరి వెళ్లాడు. అక్కడ ఐరన్‌ను లోడు చేయించుకున్న మహేష్ భట్టుపల్లి మీదుగా పీసీపల్లికి వస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో ఐరన్‌లోడుతో వస్తున్న ట్రాక్టర్ భట్టుపల్లి దాటగానే అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్‌ను నడుపుతున్న మహేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పీసీపల్లి ఎస్సై ఎక్స్‌కవేటర్ ద్వారా ట్రాక్టర్‌ను ఇంజన్‌ను వేరుచేసి ఇరుక్కుపోయి ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టమ్ కోసం కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తాపీ పనిచేస్తూ మండలంలోని చుట్టుపక్కల గ్రామాలకు సుపరిచితుడైన మహేష్ ట్రాక్టర్ ప్రమాదంలో మృతిచెందాడన్న విషయం తెలియడంతో పీసీపల్లి, తలకొండ పాడు, ముద్దపాడు, పెద్దన్నపల్లి, మర్రికుంటపల్లి, భట్టుపల్లి, బుడ్డా రెడ్డిపల్లి తదితర గ్రామాల ప్రజలంతా ప్రమాదస్థలానికి చేరుకున్నారు. మహేష్ సొంతగ్రామమైన పెద్దన్నపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.