రైతన్నలకు న్యాయం చేసే ప్రభుత్వం టీడీపీనే
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:32 PM
రైతులకు న్యాయం చేసేది ప్రజా ప్రభుత్వం మాత్రమేనని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, వైపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన నేపథ్యంలో కృతజ్ఞతగా నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన రైతన్నలు గురువారం పట్టణంలో ట్రాక్టర్‌లతో ర్యాలీ నిర్వహించారు.
త్వరలోనే వెలిగొండ పూర్తి, మార్కాపురం జిల్లా ఏర్పాటు
ఎమ్మెల్యే నారాయణరెడ్డి
మార్కాపురం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : రైతులకు న్యాయం చేసేది ప్రజా ప్రభుత్వం మాత్రమేనని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన నేపథ్యంలో కృతజ్ఞతగా నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన రైతన్నలు గురువారం పట్టణంలో ట్రాక్టర్‌లతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక అల్లూరి పోలేరమ్మ దేవస్థానం నుంచి సాయంత్రం 4.00 గంటలకు ట్రాక్టర్‌ల ర్యాలీని ఎమ్మెల్యే కందుల ప్రారంభించారు. అక్కడ నుంచి కరెంట్ ఆఫీసు, ఆర్టీసీ బస్టాండ్, గడియార స్తంభం, సప్తగిరి సెంటర్‌ల మీదుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ వరకు ట్రాక్టర్‌ల ర్యాలీ జరిగింది. సుమారు 500కు పైగా ట్రాక్టర్‌లు ర్యాలీలో పాల్గొన్నాయి. ఏఎంసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని పథకాలను అమలు చేస్తున్నారన్నారు. సూపర్‌సిక్స్ పథకాల్లో ఒకటైన అన్నదాన సుఖీభవ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నా ప్రతిపక్ష నాయకులు కడుపు మంటతో విమర్శలు చేయడం హేయమన్నారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే జగన్‌రెడ్డి జాతికి అంకితం చేసి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెలిగొండ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించడంతో పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. త్వరలోనే ప్రాజెక్టును పూర్తిచేసి ఈ ప్రాంత ప్రజల నీటి కష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చుతారని చెప్పారు. మార్కాపురం జిల్లా విషయాన్ని గత వైసీపీ నేతలు విస్మరించారన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, మార్కాపురం, పొదిలి ఏఎంసీ చైర్మన్‌లు మాలపాటి వెంకటరెడ్డి, డాక్టర్ ఇమామ్ సాహెబ్, మార్కాపురం, మిట్టమీదిపల్లి సొసైటీ ప్రెసిడెంట్లు జవ్వాజి రామాంజులరెడ్డి, గొలమారు నాసర్‌రెడ్డి, మార్కాపురం పట్టణ, మండల, తర్లుపాడు మండలాల పార్టీ అధ్యక్షులు పఠాన్ ఇబ్రహీంఖాన్, కాకర్ల శ్రీనివాసులు, ఉడుముల చిన్నపరెడ్డి పాల్గొన్నారు.
రైతు సంక్షేమం టీడీపీతోనే
వైపాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు
ఎర్రగొండపాలెం : రైతుల సంక్షేమం కోరేది టీడీపీ ప్రభుత్వమని, వారికిచ్చిన మాటను అన్నదాత సుఖీభవ అమలుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిలుపుకున్నారని టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. నియోజకవర్గంలోని రైతులు ట్రాక్టర్లతో ఎర్రగొండపాలెంలో బుధవారం అన్నదాతసుఖీ భవ కృతజ్ఞతా ర్యాలీని నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఏఎంసీ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ రైతులకు తొలివిడత పెట్టుబడి సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారన్నారు. 2014 నుంచి 2019 వరకు రైతులకు సబ్సిడీపై 24 వేల ట్రాక్టర్లను సంపిణీ చేసిన ఘనత టీడీపీదేనన్నారు. 90 శాతం సబ్సిడీపై 7 డ్రోన్ స్ర్పేయర్లను ఇటీవల పంపిణీ చేసినట్లు తెలిపారు. పులివెందులలో జరిగిన ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి న విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పచ్చ టీడీపీ ప్రభంజనం సృష్టించాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ప్రసాదరావు, యేర్వ మల్లికార్జునరెడ్డి, మేకల వళరాజు, ఎం.శ్రీనివాసరెడ్డి, టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు శనగా నారాయణరెడ్టి, చిట్యాల వెంగళరెడ్డి, వేగినాటి శ్రీను, కాకర్లకోటయ్య, కంచర్ల సత్యనారాయణగౌడ్, షేక్ మాబు, జడిలక్ష్మయ్య, సొసైటి అధ్యక్షులు, రైతునాయకులు, రైతులు పాల్గొన్నారు.