గ్రామీణ రోడ్లకు మహర్దశ
ABN , Publish Date - Dec 10 , 2025 | 02:24 AM
పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన ఈ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కేంద్ర పథకమైన స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వె్‌స్టమెంట్ (సాస్కి) నిధులను మంజూరు చేసింది.
జిల్లాకు రూ.95.55కోట్లు మంజూరు
కేంద్ర పథకం సాస్కి నిధులతో పనులు
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన ఈ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కేంద్ర పథకమైన స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వె్‌స్టమెంట్ (సాస్కి) నిధులను మంజూరు చేసింది. అందులో జిల్లావ్యాప్తంగా 210.87 కిలోమీటర్ల రోడ్ల పునర్నిర్మాణా నికి రూ.95.55 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధుల ద్వారా జిల్లాలో 37 పనులు చేపట్టనున్నారు. జిల్లా పంచాయతీరాజ్ శాఖ నుంచి పంపిన ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వం ఆ రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. అత్యధికంగా కొండపి నియోజకవర్గంలో 9 రోడ్లకు రూ.22.71 కోట్లు ఇచ్చింది. మార్కా పురం నియోజకవర్గంలో నాలుగు రోడ్లకు రూ.10.20 కోట్లు, కనిగిరి నియోజకవర్గంలో నాలుగు రోడ్లకు రూ.11.84 కోట్లు, గిద్దలూరు నియోజకవర్గంలో నాలుగు రోడ్లకు రూ.10.24 కోట్లు, దర్శి నియోజకవర్గంలో మూడు రోడ్లకు రూ.10.17 కోట్లు కేటాయించింది. ఒంగోలు నియోజకవర్గంలో మూడు రోడ్లకు రూ.9.39 కోట్లు, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మూడు రోడ్లకు రూ.10.64కోట్లు, సంతనూతలపాడు నియోజకవర్గంలో ఏడు రోడ్లకు రూ.10.26 కోట్లు మంజూరు చేసింది.