పల్లె వైద్యం.. పేదలకు దూరం
ABN , Publish Date - May 20 , 2025 | 10:39 PM
మార్కాపురం సబ్ డివిజన్‌లో గ్రామీణ ప్రాంతాల రోగులకు వైద్య సేవలు అందించాల్సిన విలేజి హెల్త్ క్లినిక్‌లు సక్రమంగా తెరచుకోవడం లేదు. ఆయా క్లినిక్‌లకు సిబ్బంది నామమాత్రంగా హాజరవుతుండడంతో సమయానికి పేదలకు వైద్యం అందడం లేదు.
గత వైసీపీ పాలన మత్తులో నుంచి
బయటపడని వైద్య ఆరోగ్యశాఖ
కంభం, మే 20 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం సబ్ డివిజన్‌లో గ్రామీణ ప్రాంతాల రోగులకు వైద్య సేవలు అందించాల్సిన విలేజి హెల్త్ క్లినిక్‌లు సక్రమంగా తెరచుకోవడం లేదు. ఆయా క్లినిక్‌లకు సిబ్బంది నామమాత్రంగా హాజరవుతుండడంతో సమయానికి పేదలకు వైద్యం అందడం లేదు. మార్కాపురం డివిజన్ పరిధిలోని యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లోని పల్లెల్లో ఉన్న విలేజ్ క్లినిక్ ఆసుపత్రుల్లో సేవలు అందకపోవడంతో ప్రజలు ఆర్‌ఎంపీ లను ఆశ్రయిస్తున్నారు. అత్యవసర వైద్యం కోసం పట్టణాలకు వెళ్లే వారు మార్గమద్యంలోనే ఆరోగ్యం విషమించి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. క్లికిక్‌ల దుస్థితి కళ్లెదుట కనపడుతున్నా జిల్లా వైద్యశాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అర్ధ వీడు మండలం నల్లమల అటడికి దగ్గరగా నియోజకవర్గానికి దూరంగా రెండు పాయలుగా చీలి ఉండడం, అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సిబ్బంది ఎప్పుడు వస్తారో, వెళతారో తెలియని పరిస్థితి ఉంది. సిబ్బందిని డాక్టర్ ఎక్కడకు వెళ్లారని అడిగితే క్యాంప్‌లో ఉన్నట్లు సమాధానం వస్తుంది. 3 నియోజకవర్గాల్లో సుమారు 100 వరకు విలేజి క్లినిక్‌లను గత వైసీపీ హయాంలో ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో సిబ్బందిని కూడా నియమించారు. వీటి సేవలు అంతంత మాత్రంగా ఉండడంతో పేదలకు వైద్య సేవలు అందడం లేదు. కొన్ని చోట్ల అద్దె భవనాల్లో ఏర్పాటు చేసిన క్లినిక్‌లకు అద్దె భారం తప్ప సేవలు లేవు. వీటిని పర్యవేక్షించాల్సిన పీహెచ్‌సీ వైద్యులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ దుస్థితి తలెత్తింది. చాలా కేంద్రాలకు సిబ్బంది చుట్టంచూపుగా వచ్చి వెళ్తు న్నారు. కొన్ని చోట్ల కేంద్రాలు తెరుస్తున్న దాఖలాలు కూడా లేవు. అర్ధవీడు మండల పరిధిలోని గ్రామాల్లో సిబ్బంది హాజరు కాకుండా ఆశా కార్యకర్తలతో క్లినిక్‌లను తెరిపించి మమ అనిపిస్తున్నారు. పెద్దారవీడు, దోర్నాల, పుల్లలచెరువు, మార్కాపురం, రాచర్ల, గిద్దలూరు మండలాల పరిధిలోని అటవీ ప్రాంత పల్లెల్లో కేందాల్రకు తాళాలే తీయడం లేదు. దీంతో రోగులు చిన్నపాటి జ్వరాలకు వైద్యం అందక దూర ప్రాంతాలకు పరుగుతీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్లినిక్‌లను తెరి చి సిబ్బందిని అందుబాటులో ఉండేలా చర్య లు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.