Share News

ఆర్టీసీకి దసరా తాకిడి

ABN , Publish Date - Sep 30 , 2025 | 01:22 AM

దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీకి ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఇప్పటికే స్త్రీశక్తి పథకం ద్వారా బస్సులన్నీ కిటకిటలాడుతుండగా, మరోవైపు పండుగకు సొంతూర్లకు వెళ్లేందుకు జిల్లాకు వస్తున్న వారి కోసం ఆర్టీసీ అదనపు బస్సులను కేటాయించింది.

ఆర్టీసీకి దసరా తాకిడి
ప్రయాణికులతో కిటకిటలాడుతున్న ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్‌

జిల్లా నుంచి 100 స్పెషల్‌ సర్వీసులు

స్త్రీశక్తి బస్సుల్లో రోజుకు లక్ష మంది

ఇతర బస్సుల్లో సాధారణ చార్జీలు వసూలు

అదనపు భారం తొలగింపుతో ఉపశమనం

ప్రయాణికులతో రద్దీగా బస్టాండ్‌లు

ఒంగోలు కార్పొరేషన్‌, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీకి ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఇప్పటికే స్త్రీశక్తి పథకం ద్వారా బస్సులన్నీ కిటకిటలాడుతుండగా, మరోవైపు పండుగకు సొంతూర్లకు వెళ్లేందుకు జిల్లాకు వస్తున్న వారి కోసం ఆర్టీసీ అదనపు బస్సులను కేటాయించింది. రీజియన్‌ పరిధిలో మొత్తం 485 బస్సులు నడుస్తుండగా అందులో 316 స్త్రీశక్తికి కేటాయించారు. వాటిలో రోజుకు లక్ష మంది వరకు ప్రయాణిస్తున్నారు. పండుగ ప్రభావంతో వారి సంఖ్య మరింత పెరిగింది. సూపర్‌ లగ్జరీ, గరుడ, వెన్నెల, తదితర ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో చార్జీలతో ప్రయాణం చేయాల్సి ఉండటంతో దూరప్రాంత ప్రయాణికుల రాక జిల్లాకు పెరిగింది. ఈనేపథ్యంలో హైదరాబాద్‌, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, విజయవాడ, శ్రీశైలం ప్రాంతాలకు అదనంగా వంద బస్సులను ఏర్పాటు చేశారు. దీంతో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణం జనంతో కళకళలాడుతోంది. ఏ బస్సు చూసినా జనాలతో కిక్కిరిసి వెళుతోంది.

మూడు రోజులు సాధారణ చార్జీలు

ఇతర ప్రాంతాల్లోని ప్రజలు జిల్లాకు రానుండడంతో సోమవారం నుంచి బుధవారం వరకు స్పెషల్‌ బస్సులను సాధారణ చార్జీలతో నడపనున్నారు. సాధారణ రోజుల్లో షెడ్యూల్‌ సామర్థ్యానికి మించి ప్రయాణికులు సంఖ్య పెరగడంతో అందుకు అనుగుణంగా ఆర్టీసీ యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్‌లో చార్జీలను భరించలేక అత్యధిక శాతం మంది ఆర్టీసీని వినియోగంచుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో పండుగ సమయాల్లో ప్రైవేటు బస్సులకే ప్రాధాన్యతనిచ్చే జిల్లా ప్రజలు ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన స్త్రీశక్తి బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

రోజుకు లక్షకుపైగా మహిళల ప్రయాణం

సాధారణ రోజుల్లోనే రోజుకు 1.5లక్షల మందిఆర్టీసీలో ప్రయాణిస్తుండగా, పండుగ ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగింది. 2 లక్షల మందికిపైనే ప్రయాణిస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. అందులో మహిళలే లక్షకుపైగా ఉన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా 100 బస్సులను కేటాయించారు. అయితే కొన్ని రూట్లలో తక్కువగా తిరిగే బస్సులను దసరా కోసం స్పెషల్‌ బస్సులుగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌, విజయవాడ, వైజాగ్‌, చెన్నై, బెంగళూరు నుంచి జిల్లాకు వచ్చే వారితో బస్టాండ్‌లు కిటకిటలాడుతున్నాయి.

Updated Date - Sep 30 , 2025 | 01:22 AM