అరకొర బస్సులతో ప్రయాణమెట్టా?
ABN , Publish Date - Aug 12 , 2025 | 10:27 PM
ప్రజా ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో భాగంగా మహిళలకు ఆ ర్టీసీ బస్‌లలో ఉచిత ప్రయాణాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి అమలు చే యనుంది. ఆ మేరకు ఇప్పటికే జీవో జారీ చేసింది. అందుకు తగ్గట్లు అద్దంకి డిపోలో ఎలాంటి అదనపు బస్సులు కేటాయించలేదు. ఉన్న అరకొర బస్సులతో నెట్టుకురావాల్సిన పరిస్థితి.
పల్లెలకు నడవని పల్లె వెలుగులు
ఈ నెల 15 నుంచి స్త్రీశక్తి పథకం అమలు
గ్రామీణ మహిళలకు ఆటోల ప్రయాణమే దిక్కా!
అద్దంకి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో భాగంగా మహిళలకు ఆ ర్టీసీ బస్‌లలో ఉచిత ప్రయాణాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి అమలు చే యనుంది. ఆ మేరకు ఇప్పటికే జీవో జారీ చేసింది. అందుకు తగ్గట్లు అద్దంకి డిపోలో ఎలాంటి అదనపు బస్సులు కేటాయించలేదు. ఉన్న అరకొర బస్సులతో నెట్టుకురావాల్సిన పరిస్థితి.
ఉన్న బస్‌లు 69
ప్రస్తుతం అద్దంకి డిపోలో మొత్తం 69 బస్సులు ఉండగా అందులో 4 సూపర్ లగ్జరీ బస్సులు కాగా మిగిలినవి పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి. పల్లెవెలుగు బస్సులలో అత్యధిక శాతం ప్రధాన రూట్లు అయిన నర్సరావుపేట, ఒంగోలు, వినుకొండ, పొదిలి రూట్లలోనే తిరుగుతున్నాయి. గ్రామాలకు నడిచే పల్లె వెలుగు బస్సులు పట్టుమని 10 కూడా లేవు. కొన్ని బస్సులను మాత్ర ం ఆయా గ్రామాల నుంచి విద్యార్థులు పాఠశాలలు, కళాశాలకు వచ్చే విధంగా ఉదయం, సాయంత్రం సమయాలలో మాత్రమే నడుపుతున్నారు. కొన్ని బస్సులు అయితే ఉదయం పూట మాత్రమే నడుపుతున్నారు. సాయంత్రం ఆయా గ్రామాలకు వెళ్లాలంటే ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించక తప్పని పరిస్థితి.
కొన్ని గ్రామాలకు రాని పల్లె వెలుగు బస్‌లు
అద్దంకి నుంచి వైదన, బల్లికురవ మీదుగా చిలకలూరిపేట బస్సు, అద్దంకి నుంచి తాళ్లూరు, గంగవరం మీదుగా బొద్దికూరపాడు నడిపే బస్సులు ఉదయం సమయంలో మాత్రమే నడుపుతున్నారు. అద్దంకి నియోజకవర్గంలో సుమారు 30కు పైగా గ్రామాలకు అసలు ఆర్టీసీ బస్ సౌకర్యమే లేదు.
అద్దంకి మండలంలోని ప్రధాన గ్రామాలైన ధేనువకొండ, బొమ్మనంపాడు, చినకొత్తపల్లి, మణికేశ్వరం, నాగులపాడు, వెంకటాపురం తదితర గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపటం లేదు. దీంతో అత్యధిక గ్రామాల నుంచి ప్రజలు ఆటోలలోనే ప్రయాణిస్తున్నారు. ఇలా మొక్కుబడిగా బస్సులు నడిపితే ఆయా గ్రామాల నుంచి మహిళలు ఎలా ప్రయాణం చేయాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి అవకాశం ఉన్న మేర అత్యధిక గ్రామాలకు బస్సులు నడిపే విధంగా చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల మహిళలు కోరుతున్నారు.