Share News

మినీ స్టేడియం ఆధునికీకరణకు రూ.2.37కోట్లు

ABN , Publish Date - Dec 18 , 2025 | 02:43 AM

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ సూచనతో నగరంలోని మినీస్టేడియం అభివృద్ధికి రూ.2.37 కోట్లుకేటాయించినట్లు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) చైర్మన్‌ రవినాయుడు తెలిపారు. బుధవారం ఒంగోలు వచ్చిన ఆయన మినీ స్టేడియంను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

మినీ స్టేడియం ఆధునికీకరణకు రూ.2.37కోట్లు
ఒంగోలులో మినీస్టేడియంను పరిశీలిస్తున్న శాప్‌ చైర్మన్‌ రవినాయుడు

మూతబడిన కేవీఎస్‌లను పునఃప్రారంభిస్తాం

క్రీడాకారులను మోసం చేసిన సంఘాలపై చర్యలు తీసుకుంటాం

రాష్ట్రంలో ఫెన్సింగ్‌ క్రీడకు గుర్తింపును రద్దు చేశాం

శాప్‌ చైర్మన్‌ రవినాయుడు

ఒంగోలు కార్పొరేషన్‌, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ సూచనతో నగరంలోని మినీస్టేడియం అభివృద్ధికి రూ.2.37 కోట్లుకేటాయించినట్లు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) చైర్మన్‌ రవినాయుడు తెలిపారు. బుధవారం ఒంగోలు వచ్చిన ఆయన మినీ స్టేడియంను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా మార్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక సంస్కరణలు చేశారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రీడలను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. స్పోర్ట్స్‌ పాలసీ లేకుండా, క్రీడాకారులకు కనీస ప్రోత్సాహకాలు కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడల అభివృద్ధికి అనేక చర్యలు తీసు కున్నదని తెలిపారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.2.25 కోట్లతో ఉమ్మడి జిల్లాలోని దర్శి, అద్దంకి, వైపాలెంలో క్రీడా వికాస కేంద్రాల పనులు చేపట్టి త్వరలో అందు బాటులోకి తెస్తామని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవ త్సరం నాటికి ఒంగోలు మినీస్టేడియంలోఇండోర్‌, అవుట్‌ డోర్‌ క్రీడలతోపాటు, బాక్సింగ్‌, ఖోఖో గ్రౌండ్‌లను, వాకింగ్‌ ట్రాక్‌ను అందుబాటులో తెస్తామన్నారు. రంగారాయుడు చెరువుకట్టపై వాకింగ్‌ ట్రాక్‌, డీఆర్‌ఆర్‌ఎం స్కూలులో ఫుట్‌బాల్‌ మైదానం, సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు పక్కన వాలీబాల్‌ కోర్టు, కర్నూలు రోడ్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద షటిల్‌ కోర్టును నిర్మిస్తామని చెప్పారు. ఈ పనులు మరో రెండు నెలల్లో మొదలుపెడతామని వెల్లడించారు. వైసీపీ హయాంలో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఆ లెక్కలన్నీ తేల్చి బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటామని రవినాయుడు పేర్కొన్నారు.

క్రీడా సంఘాలు అక్రమాలకు పాల్పడితే చర్యలు

సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అనేకఅక్రమాలు జరిగాయని, ప్రతిభ కలిగిన క్రీడాకారులకు న్యాయం చేయకుండా సర్టిఫికెట్‌లు అమ్ముకోవడం తన దృష్టికి వచ్చిందని రవినాయుడు తెలిపారు. దీనిపై త్రిసభ్య కమిటీతో విచారణ చేపట్టామన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఒంగోలులోనే అంతులేని అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఈ మాఫియా అంతుచూస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే క్రిమినల్‌ కేసులు పెడతామని తెలిపారు. రాష్ట్రంలో ఫెన్సింగ్‌ క్రీడను నిషేధించామన్నారు. దానికి గుర్తింపు లేదన్న విషయాన్ని క్రీడాకారుల తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. కొన్ని క్రీడా సంఘాలు సర్టిఫికెట్‌లను అమ్ముకోవడం, అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిని తొక్కినార తీస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Updated Date - Dec 18 , 2025 | 02:43 AM