Share News

రైతుల ఖాతాల్లోకి రూ.180.36కోట్లు

ABN , Publish Date - Nov 19 , 2025 | 01:27 AM

అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు బుధవారం రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. జిల్లాలో 2.68లక్షల మంది రైతులకు ఈ విడత రూ.180.36 కోట్ల లబ్ధి చేకూరనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కడప జిల్లా కమలాపురంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగే సభలో ఈ నిధులను విడుదల చేస్తారు.

రైతుల ఖాతాల్లోకి రూ.180.36కోట్లు

నేడు జమకానున్న అన్నదాత సుఖీభవ రెండో విడత సాయం

కడప జిల్లాలో విడుదల చేయనున్న సీఎం

అన్ని ఆర్‌ఎస్‌కేలలో ప్రత్యక్ష ప్రసారం

మర్రిపూడిలో పాల్గొననున్న మంత్రి, కలెక్టర్‌

ఇతరచోట్ల ముఖ్యనేతల హాజరు

ఒంగోలు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు బుధవారం రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. జిల్లాలో 2.68లక్షల మంది రైతులకు ఈ విడత రూ.180.36 కోట్ల లబ్ధి చేకూరనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కడప జిల్లా కమలాపురంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగే సభలో ఈ నిధులను విడుదల చేస్తారు. ప్రభుత్వ ఆదేశాలతో సీఎం సభను జిల్లాలోని అన్ని రైతు సేవా కేంద్రాలలో (ఆర్‌ఎస్‌కే) స్మార్ట్‌ టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ పథకంతో అన్నదాత-సుఖీభవను రాష్ట్రప్రభుత్వం అనుసంధానం చేసిన విషయం విదితమే. మూడు విడతల్లో కేంద్రం రూ.6వేలు, రాష్ట్రప్రభుత్వం రూ.14వేలు ఇస్తుండగా తొలివిడత కేంద్రం రూ.2వేలు, రాష్ట్రం రూ.5వేలు కలిపి రూ.7వేలను ఈ ఏడాది ఆగస్టు 2న రైతు ఖాతాల్లో జమ చేశారు. రెండో విడత కూడా కేంద్రం రూ.2వేలు, రాష్ట్రం రూ.5వేలు కలిపి రూ.7వేల మొత్తాన్ని బుధవారం కడప జిల్లా కమలాపురంలో జరిగే సభలో సీఎం విడుదల చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర మార్గదర్శకాలకు కొంత తేడా ఉండటంతో పీఎం కిసాన్‌ పథకం వర్తించే వారి కన్నా అన్నదాత సుఖీభవ పథకం ఎక్కువ మందికి అందనుంది. అన్ని నియోజకవర్గాల్లో, జిల్లా స్థాయిలోనూ కార్యక్రమాన్ని నిర్వహించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. తదనుగుణంగా బుధవారం మర్రిపూడిలో కార్యక్రమానికి మంత్రి డాక్టర్‌ స్వామి, కలెక్టర్‌ రాజాబాబుతోపాటు మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య హాజరుకానున్నారు. ఇతరచోట్ల ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు, అధికారులు పాల్గొంటారు.

Updated Date - Nov 19 , 2025 | 01:27 AM