మార్టు మూసివేతపై ఆర్పీల ఆగ్రహం
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:20 AM
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో జరుగుతున్న వ్యవహారాలపై ఆర్పీలు మండిపడ్డారు. ఈనెల 3న ఆంధ్రజ్యోతిలో ‘మహిళా మార్ట్ మూత’ శీర్షికన ప్రచురితమైన కథనంతో వారిలో కదలిక వచ్చింది. సోమవారం ఒంగోలులోని మెప్మా కార్యాలయానికి వెళ్లి ప్రాజెక్టు డైరెక్టర్‌తోపాటు, మార్ట్ నిర్వ హణ బాధ్యతలు చూసే మార్కెటింగ్ మేనేజర్, సీఎంఎంలను నిలదీశారు.
లెక్కలు చెప్పాలని పీడీ, సీఎంఎంలను నిలదీత
మెప్మా ఎండీ, ఎమ్మెల్యే దామచర్లకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం
ఒంగోలు కార్పొరేషన్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో జరుగుతున్న వ్యవహారాలపై ఆర్పీలు మండిపడ్డారు. ఈనెల 3న ఆంధ్రజ్యోతిలో ‘మహిళా మార్ట్ మూత’ శీర్షికన ప్రచురితమైన కథనంతో వారిలో కదలిక వచ్చింది. సోమవారం ఒంగోలులోని మెప్మా కార్యాలయానికి వెళ్లి ప్రాజెక్టు డైరెక్టర్‌తోపాటు, మార్ట్ నిర్వ హణ బాధ్యతలు చూసే మార్కెటింగ్ మేనేజర్, సీఎంఎంలను నిలదీశారు. మార్ట్‌లో పెట్టుబడులు, లాభాలు, ఇతర ఆర్థిక లావాదేవీలపై లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. తామంతా అప్పటి మెప్మా అధికారుల ఆదేశాలతో పొదుపు సంఘాల నుంచి రూ.1500 వసూలు చేసి ఇచ్చామని, మార్ట్ ఏర్పాటుకు రూ.65లక్షల నగదు చెల్లించామని తెలిపారు. ప్రస్తుతం మార్ట్ మూసివేయడంతో పొదుపు సంఘాల సభ్యులు తమను నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఏం సమాధానం చెప్పాలని నిలదీశారు. దీంతో అవాక్కయిన అధికారులు ఆరు నెలలు గడువు ఇస్తే తిరిగి మార్ట్‌ను ప్రారంభిస్తామని బదులిచ్చారు. దీంతో ఆర్పీలు లెక్కలు తేల్చేవరకు తాము కదిలేది లేదని పట్టుబట్టడంతో అధికారులు మార్ట్ ఆర్థిక వ్యవహారాలను అప్పటికప్పుడు పరిశీలించారు. రూ.68 లక్షల పెట్టుబడితో ఏర్పాటు చేయగా ప్రస్తుతం రూ.17.50 లక్షలు మాత్రమే ఉన్నట్లు తేలింది. కనీసం సరుకులు స్టాక్ కూడా లేదని వారు గుర్తించారు. దీంతో మార్ట్‌లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని ఆర్పీలు డిమాండ్ చేశారు. కాగా త్వరలోనే విజయవాడలోని మెప్మా మిషన్ డైరెక్టర్‌కు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను ఫిర్యాదు చేసేందుకు వారు ఆర్పీలు సిద్ధమైనట్లు సమాచారం.