Share News

డెలివరీ బాయ్‌పై రౌడీషీటర్‌ పాశవిక దాడి

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:39 PM

ఓ సంస్థలో డెలివరీబాయ్‌ను మద్యం మత్తులో ఉన్న ఓ రౌడీషీటర్‌ మోటార్‌ సైకిల్‌తో ఢీకొట్టడమేగాక విచక్షణారహితంగా దాడి చేశాడు.

డెలివరీ బాయ్‌పై రౌడీషీటర్‌ పాశవిక దాడి

స్థానికులనూ అసభ్యకరంగా మాట్లాడిన వైనం

ఒంగోలు క్రైం,డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి) : ఓ సంస్థలో డెలివరీబాయ్‌ను మద్యం మత్తులో ఉన్న ఓ రౌడీషీటర్‌ మోటార్‌ సైకిల్‌తో ఢీకొట్టడమేగాక విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ సంఘటన శనివారం రాత్రి 10 గంటల సమయంలో స్థానిక నిర్మల్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే... నగరంలోని ఓ సంస్థలో పార్శిల్‌ బాయ్‌గా పనిచేస్తున్న కిష్టిపాటి గణపతి మంగమూరు రోడ్డులో పార్శిల్‌ తీసుకొని కర్నూల్‌ రోడ్డులో పవర్‌ ఆఫీస్‌ వద్ద డెలివరీ ఇచ్చేందుకు బయలుదేరాడు. నిర్మల్‌ నగర్‌లో రాఘవ ఆసుపత్రివద్ద గోపాల్‌నగర్‌కు చెందిన ఏకాంబరం నరేంద్ర అలియాస్‌ టిల్లు మద్యం సేవించి బుల్లెట్‌పై ఎదురు వెళుతూ గణపతిని ఢీకొట్టాడు. దీంతో మోటార్‌ సైకిల్‌పై నుంచి కింద పడిన గణపతి ప్రశ్నించగా రౌడీషీటర్‌ టిల్లు విచక్షణారహితంగా దాడిచేశాడు. ఇదేమిటని అడిగిన స్థానికులను సైతం ఇష్టానుసారం అసభ్యకరంగా మాట్లాడాడు. అంతేకాదు గణపతి మోటార్‌ సైకిల్‌ తాళం లాక్కోని టిల్లు వెళ్లిపోయాడు. రౌడీషీటర్‌ ఆగడాలపై స్థానికులు సైతం విస్తుపోయారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులును కోరారు. ఈ సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రౌడీషీటర్‌ ఆగడాలపై చర్యలు లేకపోవడం ఏమిటి అనీ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Dec 07 , 2025 | 11:39 PM