దోచేశారు!
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:46 AM
మెప్మాలో అక్రమాలు రోజుకొకటి బయటకొస్తున్నాయి. అమాయక పొదుపు సభ్యులను పావులుగా వాడుకొని ఇష్టారాజ్యంగా గ్రూపులు తయారు చేసి, బ్యాంకులలో భారీగా రుణాలు పొందిన ఆర్పీల వ్యవహారం తవ్వేకొద్దీ వెలుగు చూస్తోంది. తాజాగా మరో ఆర్పీ పీడీసీసీ బ్యాంకు టౌన్ బ్రాంచ్‌లో చేసిన బోగస్ బాగోతం బహిర్గతమైంది.
మెప్మాలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆర్పీలు
వెలుగులోకి మరికొన్ని బోగస్ గ్రూపులు
రోజూ ఒక్కొక్క రి అవినీతి బాగోతం బహిర్గతం
చీమకుర్తిలో అర్హత లేని వ్యక్తికి టీఎంసీగా బాధ్యతలు
నేడు జేసీ ఆధ్వర్యంలో విచారణ
మెప్మాలో అక్రమాలు రోజుకొకటి బయటకొస్తున్నాయి. అమాయక పొదుపు సభ్యులను పావులుగా వాడుకొని ఇష్టారాజ్యంగా గ్రూపులు తయారు చేసి, బ్యాంకులలో భారీగా రుణాలు పొందిన ఆర్పీల వ్యవహారం తవ్వేకొద్దీ వెలుగు చూస్తోంది. తాజాగా మరో ఆర్పీ పీడీసీసీ బ్యాంకు టౌన్ బ్రాంచ్‌లో చేసిన బోగస్ బాగోతం బహిర్గతమైంది. దీంతో బాధిత మహిళలు లబోదిబోమంటున్నారు. గత కొన్నేళ్లుగా జరుగుతున్న అవినీతి వ్యవహారం ఇటీవల వరకు గుట్టుచప్పుడు కాకుండా సాగింది. ఆ సంస్థ ఉన్నతాధికారి, ఓ ఉద్యోగి మధ్య నెలకొన్న వివాదం పోలీసు కేసుల దాకా వెళ్లడం.. ఆపై ఆరోపణలు చేసుకోవడంతో ఒక్కసారిగా రుణ మోసం బయటపడింది. దానికితోడు ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురిస్తున్న వరుస కథనాలతో బాధితులు బయటకొస్తున్నారు. రూ.కోట్లలో నగదు కాజేసి, దర్జాగా తిరుగుతున్న వారిపై ఎలాంటి చర్యలు లేకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఒంగోలు కార్పొరేషన్, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి) : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో బోగస్ గ్రూపుల వ్యవహారం తవ్వేకొద్దీ బయటపడుతోంది. రోజుకో అక్రమం వెలుగుచూస్తోంది. మొన్న పేర్నమిట్టకు చెందిన పార్వతి అనే ఆర్పీ, నిన్న కేశవస్వామిపేట బాధ్యతలు చూసే ఆర్పీ దివ్యశాంతి అవి నీతి దందాను ‘ఆంధ్రజ్యోతి’ ఆధారాలతో సహా బయటపెట్టింది. తాజాగా మరికొందరు సభ్యులు తామూ మోసపోయామంటూ రోడ్డెక్కుతున్నారు. మామిడిపాలెంకు చెందిన ఆర్పీ విజయలక్ష్మి పీడీసీసీ బ్యాంక్ టౌన్ బ్రాంచ్‌లో తమకు తెలియకుండా, సంతకాలు కూడా లేకుండా తమ ఆధార్ కార్డులతో గ్రూపులు తయారు చేసి భారీగా రుణాలు తీసుకున్నట్లు బాధితులు వెల్లడిస్తున్నారు. లక్ష్మీనరసింహ స్వశక్తి సంఘం, లక్ష్మి పొదుపు గ్రూపు, పోలేరమ్మ స్వశక్తి సంఘం, శ్రీకృష్ణ స్వశక్తి సంఘం, గ్లోరీ స్వశక్తికి చెందిన సభ్యులు తాము మోసపోయినట్లు గుర్తించి బ్యాంకర్ల వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం. తమకు సంబంధం లేకున్నా బ్యాంకుల్లో రూ.లక్షల్లో అప్పు ఉన్నట్లు తెలిసి వారందరూ లబోదిబోమంటున్నారు. దీనిపై విచారణ చేపట్టి తమను రుణవిముక్తులను చేయాలని కోరుతు న్నారు. అయితే ఆర్పీ విజయలక్ష్మి కేవలం ఈ ఐదు గ్రూపుల సభ్యులతో చేసినవే కాకుండా మరికొన్ని బోగస్ గ్రూపులు కూడా సృష్టించి నెల్లూరు బస్టాండులోని ఇంకో జాతీయ బ్యాంకులో కూడా రుణాలు తీసుకున్నట్లు సమాచారం.
గ్రూపు ఫొటోలు లేకుండా... సంతకాలు ఫోర్జరీతో
పైన పేర్కొన్న ఐదు గ్రూపుల సభ్యుల విన్నపాన్ని పరిగణ నలోకి తీసుకున్న పీడీసీసీ బ్యాంకు టౌన్ బ్రాంచ్ అధికారులు విచారణ చేపట్టగా బోగస్ విషయం వాస్తమని తేలినట్లు సమాచారం. ముఖ్యంగా గ్రూపుసభ్యుల ఫొటోలు లేకుండా, సంతకాలు ఫోర్జరీ చేయడంతోపాటు, బ్యాంకర్లను సైతం బురిడీ కొట్టించి రూ.లక్షల్లో దోచేసినట్లు తెలుస్తోంది. అయితేప్రస్తుతానికి కొందరు ఆర్పీల అక్రమాలు మాత్రమే బయటకొస్తుండగా, ఇంకా అనేకమంది ఇదే తరహా అవినీతికి పాల్పడినట్లుగా సమాచారం. వారి చేతిలో మోసపోయిన మహిళలకు ఇంకా బ్యాంకుల నుంచి నోటీసులు రాకపోవడంతో బయటకు పొక్కలేదు.
గతంలో చర్యలు లేకపోవడంతో మరిన్ని అక్రమాలు
గతంలో అవినీతికి పాల్పడ్డ ఆర్పీలపై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వారు బొక్కేసిన సొమ్మును తిరిగి కట్టించలేదు. దీంతో మిగతా వారు మరింత రెచ్చిపోతున్నారు. అమాయక మహిళలను మోసం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మెప్మాలో చోటుచేసుకున్న అవినీతిపై క్షేత్రస్థాయి నుంచి లోతుగా అధ్యయనం చేస్తే మరి కొంతమంది ఆర్పీల మోసాలు బయటకొచ్చే అవకాశం ఉందని బాధితులు అంటున్నారు.
చీమకుర్తిలోనూ బోగస్ గ్రూపులు
చీమకుర్తి మునిసిపాలిటీలోని మెప్మాలోనూ అంతులేని అవినీతి చోటుచేసుకుంది. అక్కడి టౌన్ మిషన్ కోఆర్డినేటర్ కనుసన్నల్లో ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది. 12 బోగస్ గ్రూపులు తయారుచేసి భారీగానే బొక్కేసినట్లు సమాచారం. చీమకుర్తి మునిసిపాలిటీ టౌన్ మిషన్ కోఆర్డినేటర్‌గా పూర్తిస్థాయి అధికారి లేరు. దీంతో అర్హత లేని వారికి ప్రత్యేకించి మొన్నటి వరకు ఒంగోలులో కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా (సీవో)గా పనిచేసిన ఓ ఉద్యోగికి ఇన్‌చార్జి టీఎంసీగా బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీని వెనుక జిల్లా అధికారి చేతివాటం భారీగానే ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆ అధికారి అండదండలను ఆసరాగా చేసుకుని సదరు ఇన్‌చార్జి టీఎంసీ రెచ్చిపోయారు. అక్కడి కార్యాలయ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయడంతోపాటు ఒంగోలు మెప్మా కార్యాలయంలోనూ ఆమె పెత్తనం చేయడంపై జిల్లావ్యాప్తంగా మెప్మాలో చర్చ నడుస్తోంది. ఆమె ప్రభుత్వం ఆదేశించిన కార్యకలాపాలకన్నా బోగస్‌పైనే కన్నేసినట్లు తెలుస్తోంది. అయితే చీమకుర్తి మెప్మాలో చోటుచేసుకున్న అవినీతి, టీఎంసీ నియామకంపై విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
నేడు జేసీ ఆధ్వర్యంలో విచారణ
పట్టణ పొదుపు మహిళల పేరుతో గత కొన్నేళ్లుగా జరిగిన అవినీతి బాగోతం బయటకు రావడం, బాధితులు న్యాయం చేయాలని రోడ్డెక్కడంపై కలెక్టర్ పి.రాజాబాబు, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సీరియస్‌గా దృష్టి సారించారు. ఈక్రమంలో జేసీ గోపాలకృష్ణ చైర్మన్‌గా, జడ్పీ సీఈవో చిరంజీవి, డీఆర్‌డీఏ పీడీ నారాయణతో కూడా త్రిసభ్య కమిటీని కలెక్టర్ విచారణకు నియమించారు. వారం క్రితం మెప్మా కార్యాలయానికి జేసీ తనిఖీ చేశారు. అధికారుల నుంచి కొన్ని వివరాలను సేకరించారు. అయితే పూర్తిస్థాయి సమాచారం మెప్మా నుంచి లభించడం లేదని గుర్తించిన ఆయన లీడ్ బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడారు. పొదుపు సభ్యులకు రుణాలు మంజూరు చేసిన అన్ని బ్యాంకుల నుంచి సమాచారం సేకరించినట్లు సమాచారం. ఈ మేరకు ప్రకాశం భవన్‌లో జేసీ ఆధ్వర్యంలో గురువారం విచారణ జరగనుంది.