Share News

రహదారుణం

ABN , Publish Date - Nov 22 , 2025 | 02:44 AM

జిల్లాలో రహదారులపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. అధికశాతం రోడ్లు గుంతలమయంగా మారి వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల నిర్వహణ విషయంలో చూపిన నిర్లక్ష్యం నేటికీ వెంటాడుతోంది.

రహదారుణం
ఇలవర (నేతివారిపాలెం) గ్రామం వద్ద గోతులమయమైన ఆర్‌అండ్‌బీ రోడ్డు

ప్రయాణం నరకప్రాయం

జిల్లాలో ధ్వంసమైన రోడ్లు

మొంథా తుఫాన్‌తో ఘోరంగా పరిస్థితి

అనేక ప్రాంతాల్లో గుంతలమయం

గ్రామీణ రోడ్లే కాక ప్రధాన రహదారుల పరిస్థితీ అంతే

అవస్థలు పడుతున్న వాహనదారులు

జిల్లాలో రహదారులపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. అధికశాతం రోడ్లు గుంతలమయంగా మారి వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల నిర్వహణ విషయంలో చూపిన నిర్లక్ష్యం నేటికీ వెంటాడుతోంది. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లపై దృష్టి సారించి మరమ్మతులు చేయించింది. అయినా ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్‌తో అవి మరింత ఛిద్రమయ్యాయి. ఏ ప్రాంతంలో చూసినా భారీగా దెబ్బతిని రాకపోకలకు ఇబ్బందులు కలిగించేవే అధికంగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని లింకు రోడ్లే కాకుండా మండల కేంద్రాల మధ్యన.. అలాగే ప్రధాన పట్టణాలు, హైవేలను కలిపే ఇతర రహదారుల పరిస్థితి సైతం దారుణంగా ఉంది. ఈ విషయం జిల్లాలో ‘ఆంఽధ్రజ్యోతి’ బృందం పరిశీలనలోస్పష్టంగా కనిపించింది.

ఒంగోలు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రహదారులు దారుణంగా తయారయ్యాయి. ఎటుచూసినా గుంతలతో వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ప్రధానంగా గ్రామీణ రోడ్లు పూర్తిగా నామరూపాల్లేకుండా పోయాయి. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ రోడ్ల పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. జిల్లాలో ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో మూడు డివిజన్లు, తొమ్మిది సబ్‌ డివిజన్లు ఉన్నాయి. వాటి పరిధిలోకి మొత్తం 2,684 కి.మీ రహదారులు వస్తాయి. అత్యధికంగా గిద్దలూరు నియోజకవర్గంలో 580 కి.మీ ఉండగా దర్శిలో 474.22 కి.మీ, కనిగిరిలో 405.90 కి.మీ ఉన్నాయి. ఇక పంచాయ తీరాజ్‌ శాఖ పరిధిలో 5,554 కి.మీ రహదారులు ఉన్నాయి. ఇవికాక జాతీయ రహదారుల పరిధిలో పలు కీలక రోడ్లు ఉన్నాయి. కాగా కేంద్రప్రభుత్వ ఆధీనం లోని జాతీయ రహదారులలో అక్కడక్కడా కొద్దిమేర తప్ప అత్యధికభాగం బాగానే ఉండగా ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోని రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. గత వైసీపీ ప్రభుత్వం ఆ శాఖను నిర్లక్ష్యం చేసి రోడ్ల నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో జిల్లాలోని అనేక ఆర్‌అండ్‌బీ రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి.

ప్రజాప్రభుత్వం రాగానే మరమ్మతులు

ఆ పరిస్థితిని గుర్తించిన ప్రజా ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక గుంతలు లేని రోడ్ల పథకం పేరుతో ప్రధాన రహదారు లకు మరమ్మతులు చేయించింది. జిల్లాలో ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న 2,684 కి.మీ రహదారులలో దాదాపు 2,020 కి.మీ దెబ్బతిన్నట్లు గుర్తించి అందులో తక్షణ అవసరంగా భావించిన 1,453 కి.మీ రోడ్లకు రూ.13.76 కోట్లతో తొలి విడత అలాగే మరో 5,66.86 కి.మీ. రూ.11.40 కోట్లతో మరమ్మతులు గత ఏడాది అక్టోబరు నుంచి డిసెంబరు వరకు చేయించారు. మంజూరు చేసిన పనులలో 90శాతం పూర్తయ్యాయి. అలాగే పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోనూ సుమారు రూ.37.99 కోట్లతో 70 పనులు చేపట్టారు. దీంతో గత ఏడాది నుంచి కొంతమేర రోడ్లపై ప్రయాణానికి ఇబ్బంది లేకుండా సాగుతోంది.

దెబ్బతీసిన మొంథా తుఫాన్‌

ఇటీవల జిల్లాను ముంచెత్తిన మొంథా తుఫాన్‌ రోడ్లను ధ్వంసం చేసింది. అత్యధిక శాతం గండ్లుపడటం, కోతకు గురికావడంతోపాటు గతుకులు, గోతులమయంగా మారాయి. ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ తేడా లేకుండా అన్నిరకాల రోడ్లు అలా దెబ్బతినగా తుఫాన్‌ ప్రభావంతో అక్కడక్కడ జాతీయరహదారులకు సైతం నష్టం వాటిల్లింది. మరోవైపు అనేక రోడ్లపై ఉన్న కల్వర్టులు, చిన్న చిన్న వంతెనలు సైతం ధ్వంసమయ్యాయి. అధికారుల అంచనా ప్రకారం మొంథా తుఫాన్‌ వల్ల జిల్లాలో సుమారు రూ.180.66 కోట్ల మేర ఆర్‌అండ్‌బీ, రూ. 70.41 కోట్ల మేర పీఆర్‌ వెరసి దాదాపు రూ.251.76 కోట్ల మేర రోడ్లకు నష్టం వాటిల్లింది. ఆ ప్రభావం ప్రస్తుతం రహదారులపై ప్రయాణిస్తున్న వారు అనుభవిస్తున్నారు. పలు రోడ్లపై వాహనచోదకులు ముందుకు పోలేక అల్లాడుతున్నారు. సాధారణంగా పావుగంటలో ప్రయాణించే దూరం ప్రస్తుతం గంట పడుతున్న పరిస్థితి పలు చోట్ల కనిపిస్తోంది. అంతేకాక వాహనాలు ధ్వంసమవుతున్నాయి.

మరమ్మతులు చేసినవీ పాడయ్యాయి

ఆయాప్రాంతాలలో పరిశీలిస్తే.. వైపాలెం నుంచి త్రిపురాంతకం వెళ్లే రోడ్డు, దోర్నాల నుంచి ఆత్మకూరు నల్లమల అటవీ ప్రాంతంలో నుంచి వెళ్లే రోడ్డు, మార్కాపురం నుంచి తర్లుపాడు వెళ్లే రోడ్డు, బేస్తవారపేట నుంచి కోనపల్లి వెళ్ళే రోడ్డు అధ్వానంగా తయారయ్యాయి. కడప- విజయవాడలో పోరుమమిళ్ల నుంచి తాటిచెర్ల మోటు వరకు, టంగుటూరు-పొదిలి రోడ్డులో మర్రిపూడి వద్ద అలాగే పెట్లూరు వద్ద కొన్ని కి.మీ, వెల్లంపల్లి- తాళ్లూరు రోడ్డులో శివరాంపురం ప్రాంతం వద్ద దర్శి నుంచి అద్దంకి వెళ్లే రోడ్డులో చిలకలేరు ప్రాంతంలో, ఒంగోలు-చీరాల జాతీయ రహదారిపై త్రోవగుంట నుంచి ఉప్పుగుండూరు వరకు, ఒంగోలు- పొదిలి రోడ్డులో గ్రానైట్‌ క్వారీల ప్రాంతం, ఎస్‌ఎన్‌పాడు- కొండపి మార్గంలో మద్దులూరు ప్రాంతంలో, ఒంగోలు-కొత్తపట్నం రోడ్డు, కనిగిరి -వేములపాడు రోడ్డు కంకర లేచిపోయి మట్టిరోడ్డును తలపిస్తోంది. ఇలా జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇక గ్రామీణ రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వివిధ మండల కేంద్రాల మధ్య అలాగే ఉన్నాయి. పలు రోడ్లకు మరమ్మతులు చేపట్టినా తుఫాన్‌తో కురిసిన భారీవర్షాలతో తిరిగి దెబ్బతిన్నట్లు చెప్తున్నారు. ఇక కొన్నిరోడ్లను ప్రభుత్వం ఇటీవల మంజూరుచేయగా వాటిని చేపట్టాల్సి ఉంది. ఈ పరిస్థితిపై ప్రభుత్వం దృష్టిసారించాలని ప్రజానీకం కోరుతోంది.

Updated Date - Nov 22 , 2025 | 02:44 AM