Share News

తుఫాన్‌ దెబ్బకు రోడ్లకు కోత

ABN , Publish Date - Oct 22 , 2025 | 09:45 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండ్రోజులు నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలకు కంభం, అర్ధవీడు మడలాలలో పలు రోడ్లు కోతలకు గురయ్యాయి. రోడ్లపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కంభం, కందులాపురం పంచాయతీల అధికారుల నిర్లక్ష్యం రెండు పంచాయతీలకు శాపంగా మారింది. ప్రధాన అంతర్గత రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీలు ఏర్పాటు చేయకపోవడం, కొన్ని చోట్ల డ్రైనేజీలు ఉన్నా వాటిల్లో పూడిక తీయకపోవడంతో డ్రైనేజీలు పొంగిపొర్లి వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయి.

తుఫాన్‌ దెబ్బకు రోడ్లకు కోత
బురదమయంగా ఉన్న సట్టుతాండా రోడ్డు

కంభం, కందులాపురం పంచాయతీల్లో

రహదారులపై గుంతలు.. నిలిచిన వర్షపు నీరు

వాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బందులు

కంభం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండ్రోజులు నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలకు కంభం, అర్ధవీడు మడలాలలో పలు రోడ్లు కోతలకు గురయ్యాయి. రోడ్లపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కంభం, కందులాపురం పంచాయతీల అధికారుల నిర్లక్ష్యం రెండు పంచాయతీలకు శాపంగా మారింది. ప్రధాన అంతర్గత రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీలు ఏర్పాటు చేయకపోవడం, కొన్ని చోట్ల డ్రైనేజీలు ఉన్నా వాటిల్లో పూడిక తీయకపోవడంతో డ్రైనేజీలు పొంగిపొర్లి వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. దీంతో రోడ్లు కోతలకు గురికావడంతో రోడ్లపై గుంతలు పడి నీరు నిలిచిపోవడంతో ద్విచక్రవాహనదారులు, పాదచారులు అదుపుతప్పి గుంతలలో పడి గాయాలపాలవుతున్నారు. ముఖ్యంగా కంభం పంచాయితీ పరిధిలోని కంభం అర్బన్‌ కాలనీ నుంచి వచ్చే ప్రధాన మురుగు కాలువ కందులాపురం పంచాయతీ పరిధిలోని కాలువ గుండా ప్రవహిస్తుంది. అయితే ఈ మురుగు కాలువలను కొంతమంది ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు కట్టడంతో మురుగు పోయే దారి లేక రోడ్లపై ప్రవహిస్తుంది. దానికి వానలు తోడవడంతో మురుగు ఇబ్బందులు తలెత్తాయి. కంభం ఆర్టీసీ బస్టాండు ముందు భాగంలో హజరత్‌ గూడెం పంచాయతీ పరిధిలోని ఇరిగేషన్‌ కాలువను, పంచాయతీ కాలువలపై ఆక్రమణలు పెరిగిపోవడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆ ప్రాంతమంతా వర్షపునీటితో నిండిపోయి గృహాలలోకి నీరు వెళ్తుండడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతలకు గురైన రోడ్లను బాగు చేయడమేగాక మురుగు నీటి కాల్వలను నిర్మించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.

కాల్వల్లో కదలని మురుగు .. ఇబ్బందులు పడుతున్న స్థానికులు

రాచర్ల : మండలంలోని అనుములవీడు దళిత కాలనీలోని సైడ్‌ కలువల్లోని మురుగనీరు బయటకు పోయే మార్గం చూడాలని కాలనీ ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేశారు. కాలనీలోని సైడ్‌ కాలువలు వర్షపు నీరు, మురుగు నీటితో నిండి ఆ నీరంతా రోడ్లపైకి వస్తున్నాయని దీంతో దుర్వాసన వెదజల్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారన్నారు. 2019 దాదాపు రూ.30లక్షల వ్యయంతో సైడ్‌ కలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని అయితే అప్పటి పాలకులు, అధికారులు కాలువల నిర్మాణంలో ఎలాంటి ప్రణాళిక లేకుండా తమకు ఆదాయం వస్తే చాలు అన్నట్లుగా నిర్మించారని, కాల్వలకు చేరే నీరు ఎక్కడికి పోవాలి? ఎలాపోవాలి ? అనే ఆలోచన చేయకుండా నిర్మించడంతో ఈ సమస్య ఏర్పడిందన్నారు. గృహాల నుంచి నీరు, వర్షపు నీరు కాలువల్లో చేరి ఆ నీరు పోయేమార్గం లేక రోడ్లపైన గృహాల ముందు కుంటలుగా మారుతున్నాయని దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారన్నారు. వర్షాకాలం కావడంతో దోమల వ్యాప్తి అధికమై క అనేకమంది అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రెండు, మూడు నెలల నుంచి పారిశుధ్య కార్మికులు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందన్నారు. వాటర్‌ ట్యాంకు లు పాచిపట్టి కంపుకొడుతు న్నాయన్నారు. ట్యాంకులకు ట్యాపులు పగిలిపోయినా పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు గానీ, పాలకులు గానీ కాలనీవైపు కన్నెత్తి చూడకపోవడం దారుణమన్నారు. ప్రభు త్వం స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛఆంధ్ర-స్వర్ణాంధ్ర అంటూ పాలకులను అధికారులు అప్రమత్తం చేస్తున్నప్పటికీ ఇక్కడి పాలకులకు, అధికారులకు ఆ నిబంధనలు వర్తించడం లేదని ప్రజలు బహిరంగంగా అంటున్నారు. అధికారులు, పాలకులు తమ నిర్లక్ష్యాన్ని వీడి గ్రా మాలను సందర్శించి సమస్య లు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేయాలని, లేకపోతే స్వచ్ఛ ఆంధ్ర అంధకార ఆంధ్రగా మారుతుందని వారన్నారు.

సట్టు తాండా రోడ్డు దారుణం

ఇబ్బందులు పడుతున్న సుగాలీలు

పుల్లలచెరువు, : పుల్లలచెరువు మండలంలోని పంచాతీయరాజ్‌ రోడ్డులు దారుణంగా ఉన్నాయి. వానలు కురిస్తే ఆ రహదారులు మాగాణిలను తలపిస్తాయి. పుల్లలచెరువు మండలంలోని సుద్దకురువ తాండా పంచాయతీలోని సట్టు తాండాకు నేటికీ రోడ్డు లేదు. దీంతో సుగాలీలు ఇబ్బందులు పడుతున్నారు. పుల్లలచెరువు - మల్లాపాలెం రోడ్డు నుంచి సుద్దకురువ వరకు బీటీ రోడ్డు ఉన్నా అక్కడ నుంచి సట్టు తాండాకు 1.5 కీలో మీటర్ల రోడ్డు లేక రాకపోకలకు సుగాలీలు ఇబ్బంది పడుతున్నారు. వాన పడితే బురద దారిలో వాహనాలు ఇరుక్కుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి శాశ్వత రోడ్డును వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Oct 22 , 2025 | 09:45 PM