ఒడా చైరన్‌గా రియాజ్
ABN , Publish Date - Aug 13 , 2025 | 02:51 AM
జిల్లాస్థాయిలో కీలకమైన ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ (ఒడా) చైర్మన్ పదవి జనసేనకు దక్కింది. ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్‌ను ఒడా చైర్మన్‌గా నియమించారు. ఈ విషయంలో తొలుత టీడీపీ అధిష్ఠానం విముఖత వ్యక్తంచేసినా తనకు ఎన్నికల్లో సంపూర్ణ సహకారం అందించినందుకు రియాజ్‌కే ఆ పదవి ఇవ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పట్టుపట్టడం కూడా కలిసి వచ్చింది.
జనసేనకు దక్కిన కీలక పదవి
తొలుత లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకం
కోర్టు సమస్య ఎదురవడంతో మార్పు
ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ కీలకపాత్ర
ఒంగోలు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాస్థాయిలో కీలకమైన ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ (ఒడా) చైర్మన్ పదవి జనసేనకు దక్కింది. ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్‌ను ఒడా చైర్మన్‌గా నియమించారు. ఈ విషయంలో తొలుత టీడీపీ అధిష్ఠానం విముఖత వ్యక్తంచేసినా తనకు ఎన్నికల్లో సంపూర్ణ సహకారం అందించినందుకు రియాజ్‌కే ఆ పదవి ఇవ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పట్టుపట్టడం కూడా కలిసి వచ్చింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి జిల్లాలో రియాజ్ ఆయన వెన్నంటి ఉన్నారు. ఆ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన 2019 ఎన్నికల్లో జనసేన తరఫున ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఒంగోలు నగరానికి చెందిన రియాజ్ గత వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలకు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడిన అనంతరం జిల్లాలో టీడీపీ నాయకులతో రియాజ్ సమన్వయంతో ముందుకు సాగారు. ప్రత్యేకంగా కీలక నేత అయిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఎన్నికల్లో ఆయన గెలుపునకు కృషి చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నామినేటెడ్ పదవుల జాబితాలో జనసేన నుంచి రియాజ్ పేరు రాష్ట్రస్థాయి పదవికి ముందు వరుసలో ఉంది. అలాగే ఎన్నికల్లో తనకు సంపూర్ణ సహకారం అందించిన ఆయనకు ఒడా చైర్మన్ పదవి ఇప్పించాలని ఎమ్మెల్యే జనార్దన్ ప్రయ త్నాలు ప్రారంభించారు. టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆ ప్రతిపాదనను కూడా ఇతర నాయకుల ముందు జనార్దన్ ఉంచారు. ఒడా చైర్మన్ వంటి కీలక పదవి టీడీపీకి చెందిన వారికే ఇవ్వాలన్న భావనలో అధిష్ఠానంలో ఉండటంతో రియాజ్ పేరు రేసు నుంచి పక్కకు తొలగి టీడీపీకి చెందిన దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పేరు ప్రముఖంగా ముందుకు వచ్చింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర లైవ్ స్టాక్ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా రియాజ్‌ను గతంలోనే నియమించారు. అయితే ఆ సంస్థకు గత వైసీపీ ప్రభుత్వంలో నియమితులైన కమిటీ సభ్యులు కోర్టును ఆశ్రయించడంతో రియాజ్ ఆబాధ్యతలు చేపట్టలేకపోయారు. ఈక్రమంలో ఒకవైపు తన పార్టీ (జనసేన) నేతల ద్వారా రియాజ్, మరోవైపు తాను తొలుత చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా ఎమ్మెల్యే జనార్దన్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. చివరకు ఒడా చైర్మన్ పదవి రియాజ్‌కే దక్కింది.