వరినాట్లు ముమ్మరం
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:36 AM
సాగర్ నీరు సరిపడా సరఫరా అవుతుండటంతో రైతులు వరినాట్లు ముమ్మరం చేశారు. ప్రస్తుతం జిల్లాలో ప్రవేశించే సరిహద్దు 85/3 మైలు వద్ద 2,746 క్యూసెక్కుల నీరు కాలువలో ప్రవహిస్తోంది. ఇందులో త్రిపురాంతకం పరిధిలోని ఉమ్మడివరం, ముడివేముల, మిరియంపల్లి మేజర్ల ద్వారా 72 క్యూసెక్కుల నీరు రైతుల కోసం సరఫరా చేస్తున్నారు.
సాగుకు సరిపడా సాగర్ నీరు
త్రిపురాంతకం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): సాగర్ నీరు సరిపడా సరఫరా అవుతుండటంతో రైతులు వరినాట్లు ముమ్మరం చేశారు. ప్రస్తుతం జిల్లాలో ప్రవేశించే సరిహద్దు 85/3 మైలు వద్ద 2,746 క్యూసెక్కుల నీరు కాలువలో ప్రవహిస్తోంది. ఇందులో త్రిపురాంతకం పరిధిలోని ఉమ్మడివరం, ముడివేముల, మిరియంపల్లి మేజర్ల ద్వారా 72 క్యూసెక్కుల నీరు రైతుల కోసం సరఫరా చేస్తున్నారు. మండల పరిధిలో అధికారుల లెక్కల ప్రకారం దాదాపు 2,483 హెక్టార్లలో వరి సాగు కావచ్చని చెబుతున్నారు. ఇప్పటికే మండలంలో 361 హెక్టార్లలో వరినాట్లు వేశారు. ముడివేముల, మిరియంపల్లి, విశ్వనాఽథపురం, సోమేపల్లి, వెల్లంపల్లి-1, 2, దివిపల్లి, హసనాపురం మేజర్లలో వరినాట్లు వేయటానికి రైతులు సిద్ధమయితే వారికి కూడా సకాలంలో నీరు అందిస్తామని ఎన్నెస్పీ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఇస్తున్న మూడు మేజర్లు కాకుండా వచ్చేనెల 1 నుంచి అన్ని మేజర్లకు రైతులు కోరిన చోట సాగర్ నీరు సరఫరా చేస్తామని ఎన్నెస్పీ డీఈ విజయలక్ష్మి తెలిపారు. మొత్తానికి ఈ ఏడాది సాగర్‌నీరు ముందుగానే విడుదల కావటంతో రైతులు కూడా ఉత్సాహంతో వరిసాగుకు కదులుతున్నారు.