Share News

గ్రామీణాభివృద్ధి పథకాల పరిశీలన

ABN , Publish Date - Jun 10 , 2025 | 01:24 AM

జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాల తీరును కేంద్ర బృందం పరిశీలన చేయనుంది. అందుకోసం సోమవారం జిల్లాకు వచ్చింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా దేశవ్యాప్తంగా పల్లె ప్రాంతాల్లో పెద్దఎత్తున ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పథకాలు అమలవుతుండగా వాటి అమలు తీరును ఏటా కేంద్రప్రభుత్వం పరిశీలన చేస్తుంది.

గ్రామీణాభివృద్ధి పథకాల పరిశీలన
కలెక్టర్‌ అన్సారియాను కలిసి పూలమొక్కను అందజేస్తున్న కేంద్ర బృందం సభ్యుడు

జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర బృందం

అధికారులతో సమీక్ష

క్షేత్రస్థాయిలో ఫలితాలపై అధ్యయనం

ఒంగోలు, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాల తీరును కేంద్ర బృందం పరిశీలన చేయనుంది. అందుకోసం సోమవారం జిల్లాకు వచ్చింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా దేశవ్యాప్తంగా పల్లె ప్రాంతాల్లో పెద్దఎత్తున ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పథకాలు అమలవుతుండగా వాటి అమలు తీరును ఏటా కేంద్రప్రభుత్వం పరిశీలన చేస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఎంపిక చేసిన జిల్లాల్లో ఈ బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులు జరిగిన తీరు, వాటి ద్వారా ప్రజలకు ఒనగూరిన లబ్ధిని అధ్యయనం చేస్తాయి. అలా ఈ ఏడాది 15 రాష్ట్రాల్లో పరిశీలన చేస్తుండగా అందులో ఆంధ్రప్రదేశ్‌లో మన జిల్లాను ఎంపిక చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నత స్థాయిలోని దిశ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఉమేష్‌కుమార్‌ రామ, అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి జీఎస్‌.రావత్‌లు ఇందుకోసం జిల్లాకు వచ్చారు. ఐదు రోజులపాటు అధికారులతో కలిసి జిల్లాలో పర్యటించనున్నారు. వీరు తొలిరోజైన సోమవారం కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాను కలిశారు. అనంతరం డ్వామా, డీఆర్‌డీఏ, జడ్పీ ఇతర సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాయంత్రం డ్వామా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జలశక్తి కేంద్రం, భాగ్యనగర్‌లోని రూడ్‌సెట్‌ శిక్షణ కేంద్రాలను సందర్శించారు. అనంతరం కొత్తపట్నం మండలం పాదర్తిలో పర్యటించారు. ఈనెల 13వరకు ఎర్రగొండపాలెం, దోర్నాల, బేస్తవారపేట, దర్శి తదితర మండలాల్లో ఉపాధి హామీ పథకం పనులు, వాటర్‌షెడ్‌ నిర్మాణాలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, గ్రామాల్లో చేపట్టిన రోడ్లు, తాగునీటి పథకాలు, ఇతర పనులను పరిశీలిస్తారని డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Jun 10 , 2025 | 01:24 AM