ప్రతీకార హత్య
ABN , Publish Date - Jul 05 , 2025 | 10:57 PM
పాత కక్షల నేపథ్యంలో కత్తులతో దాడి చేసి ప్రతీకార హత్యచేసిన దుర్ఘటన పెద్ద దోర్నాల మండలంలోని నల్లగుంట్ల గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

మూడేళ్ల క్రితం జరిగిన హత్య
కేసులో హతుడే ప్రధాన నిందితుడు
అప్పట్నుంచి కుటుంబంతో సహా ఊరు విడిచి వెళ్లిన వైనం
తాజాగా స్వగ్రామానికి రావడంతో హత్య
పెద్ద దోర్నాల, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : పాత కక్షల నేపథ్యంలో కత్తులతో దాడి చేసి ప్రతీకార హత్యచేసిన దుర్ఘటన మండలంలోని నల్లగుంట్ల గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన బైరబోయిన వెంకటేశ్వర్లు(38) మృతి చెందారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... గ్రామ సర్పంచి నాగలక్ష్మి భర్త మెద్దు వెంకటేశ్వర్లును మూడేళ్ల కిందట 2022 ఫిబ్రవరి 9వ తేదీన దారి కాచి హత మార్చారు. ఆ కేసులో గ్రామానికి చెందిన బైరబోయిన వెంకటేశ్వర్లు ప్రథమ నిందితుడిగా ఉన్నారు. అప్పటి నుంచి గ్రామం విడిచి పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంట్యాల గ్రామంలో పొలం కౌలుకు తీసుకుని భార్యా పిల్లలతో అక్కడే ఉంటున్నారు. గ్రామంలో మొహర్రం నిర్వహిస్తున్న క్రమంలో వెంకటేశ్వర్లు శుక్రవారం గ్రామానికి వచ్చారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పీర్ల ఉత్సవంలో పాల్గొన్న వెంకటేశ్వర్లుపై కొందరు ఉన్నపళంగా కత్తులతో దాడి చేసి గొంతుపై విచక్షణారహితంగా నరికి చంపారు. అనంతరం ప్రత్యర్థులందరూ పరాయ్యారు. ఈ విషయమై గ్రామస్థులు దోర్నాల పోలీసుస్టేషనుకు సమాచారం అందించారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు, ఎర్రగొండపాలెం సీఐ ప్రభాకర్‌రావు, ఎస్సై మహేష్ పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంకటేశ్వర్లు భార్య విజయలక్ష్మికి విషయం చెప్పడంతో ఆమె గ్రామానికి చేరుకుంది. మృతికి గల కారణాలపై ఆరా తీయగా గ్రామ సర్పంచి నాగలక్ష్మి మరిది మొద్దు తిరుపతిరావు వర్గీయులే చంపారని హతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశ్వర్లుకు కుమారుడు ప్రవీణ్, కుమార్తె ప్రణీత ఉన్నారు. హత్యతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.