Share News

కొత్తపట్నం-ఒంగోలు రోడ్డులో రాకపోకల పునరుద్ధరణ

ABN , Publish Date - Nov 01 , 2025 | 12:01 AM

కొత్తపట్నం-ఒంగోలు, ఈతముక్కల-సూరారెడ్డిపాలెం రహదారుల్లో గత మూడు రోజులుగా నిలిచిపోయిన రాకపోకలు శుక్రవారం పునరుద్ధరించారు.

కొత్తపట్నం-ఒంగోలు రోడ్డులో రాకపోకల పునరుద్ధరణ
వరద నీటినిబయటకు పంపే పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌, వివరిస్తున్న ఇంజనీరింగ్‌ అధికారులు

వరద నీటిని తొలగించే పనులను పరిశీలించిన కలెక్టర్‌

కొత్తపట్నం, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి) : మండలంలోని కొత్తపట్నం-ఒంగోలు, ఈతముక్కల-సూరారెడ్డిపాలెం రహదారుల్లో గత మూడు రోజులుగా నిలిచిపోయిన రాకపోకలు శుక్రవారం పునరుద్ధరించారు. తుఫాన్‌ నేపథ్యంలో వరద నీరు ఆయా రోడ్లపై ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాదకర స్థాయిలో పారుతుండటంతో ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేశారు. దీంతో మూడు రోజుల పాటు కొత్తపట్నం మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రహదారుల్లో వరద నీరు భారీ ప్రవహిస్తుండటం రోజుల తరబడి రాకపోకలు ఆగిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అత్యవసర వైద్యసేవలు అందక ఇబ్బందులుపడ్డారు. ఈక్రమంలో రహదారులపై చేరిన వరద నీటిని బయటకు పంపేందుకు అధికారులు తీసుకున్న చర్యలను శుక్రవారం కలెక్టర్‌ రాజాబాబు, జేసీ గోపాలక్రిష్ట పరిశీలించారు. కొప్పోలు నుంచి అల్లూరు వరకు ఆయన వరద నీటి ఉధృతిని పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. స్థానికులతో మాట్లాడారు. అల్లూరు-ఆలూరు గ్రామాల మద్య పోతురాజు కాలువ వద్ద కొత్తగా నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద నీటకి అడ్డుగా ఉన్న అప్రోచ్‌ రోడ్డును వెంటనే తొలగించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అల్లూరు చెరువుకు అనుంధానంగా ఉన్న బేబిరెడ్డికాలు, ఎన్సెస్పీ కెనాల్‌ ఆధుకీరణ పనులు చేపట్టాలని స్థానిక రైతులు కోరారు.

Updated Date - Nov 01 , 2025 | 12:01 AM