Share News

పోలీస్‌ అంటే గౌరవం పెరగాలి

ABN , Publish Date - Dec 23 , 2025 | 01:33 AM

పోలీసు అంటే భయంతో కూడిన గౌరవం పెరగాలని, ఆ విధంగా అందరూ పనిచేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పోలీసు శిక్షణ కళాశాలలో 2025 బ్యాచ్‌కి చెందిన కానిస్టేబుళ్లకు తొమ్మిది నెలల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

పోలీస్‌ అంటే గౌరవం పెరగాలి
పోలీసులకు శిక్షణను ప్రారంభించి మాట్లాడుతున్న హోంమంత్రి అనిత, వేదికపై మరో మంత్రి స్వామి, ఎంపీ మాగుంట, కలెక్టర్‌ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తదితరులు

హోంమంత్రి వంగలపూడి అనిత

కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం

20 వేల మంది సిబ్బంది భర్తీకి చర్యలు

ఒంగోలు క్రైం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : పోలీసు అంటే భయంతో కూడిన గౌరవం పెరగాలని, ఆ విధంగా అందరూ పనిచేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పోలీసు శిక్షణ కళాశాలలో 2025 బ్యాచ్‌కి చెందిన కానిస్టేబుళ్లకు తొమ్మిది నెలల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. పోలీసు శాఖ బలోపేతానికి శిక్షణ కీలకమన్నారు. పోలీసు యూనిఫాం గౌరవం, భాధ్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. పోలీసు శాఖలో 20వేల ఉద్యోగాలు భర్తీచేయాల్సి ఉందని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, మంత్రి లోకేష్‌ ప్రత్యేక దృష్టిసారించి ఈ ఏడాది 6,100 మందిని ఎంపిక చేశారని తెలిపారు. ఇక ఏటా పోలీసు రిక్రూట్‌మెంట్‌ చేస్తామని చెప్పారు. పోలీసులు నేరరహిత సమాజం కోసం పాటు పడి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలన్నారు. శిక్షణ కాలంలో ఇచ్చే స్టైఫండ్‌ను రూ.4,500 నుంచి రూ.12వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడదని తెలిపారు.

శాంతిభద్రతలను పరిరక్షించాలి

సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ కఠోర శ్రమతో శిక్షణ పొంది శాంతిభద్రతల పరిరక్షణలో కీలకపాత్ర పోషించాలని కోరారు. పోలీసులు మహిళలు, చిన్నపిల్లలు, బలహీనవర్గాల కోసం భరోసా కల్పించాలని సూచించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ కానిస్టేబుళ్లు పోలీసు వ్వవస్థకు వెన్నుముక వంటి వారని, ఈ శిక్షణ కాలం జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశంగా భావించాలని కోరారు. క్రమశిక్షణ, నిజాయితీతో ప్రజలకు చేరువ కావాలన్నారు. కలెక్టర్‌ రాజాబాబు మాట్లాడుతూ పరిపాలనలో జిల్లా యంత్రాంగానికి పోలీసు సమన్వయం ఎంతో అవసరమన్నారు. ఎస్పీ వి.హర్షవర్థన్‌రాజు మాట్లాడుతూ పోలీసు శాఖలో కానిస్టేబుళ్ల ప్రాత ప్రధానమైనదని వివరించారు. సభకు అధ్యక్షత వహించిన పోలీసు శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్‌ రాధిక మాట్లాడుతూ కళాశాలలో శిక్షణ కోసం వివిధ జిల్లాల నుంచి 498 మంది మహిళా కానిస్టేబుళ్లను కేటాయించినట్లు తెలిపారు.వారందరిని సమర్థవతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. కార్యక్రమంలో శిక్షణ కోసం వచ్చిన కానిస్టేబుళ్ళ కోసం ప్రత్వేక ఉపన్యాసాన్ని ఏన్టీఆర్‌ కమిషనరేట్‌ డీసీపీ కేజీవి సరిత చేశారు. కార్యక్రమంలో పోలీసు శిక్షణ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డి.లక్ష్మణకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 01:33 AM