మైనారిటీలకు ఊరట
ABN , Publish Date - May 03 , 2025 | 12:45 AM
పథకాలు నిలిచిపోయి గత ఐదేళ్లుగా దాదాపు మూతపడిన మైనారిటీ కార్పొరేషన్‌కు రాష్ట్రప్రభుత్వం జవసత్వాలు చేకూర్చింది. రుణాల కోసం నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
రూ.12.05 కోట్ల రుణాలు..782 మంది లబ్ధిదారులు
దరఖాస్తుకు 25 ఆఖరు తేదీ
ఒంగోలు నగరం, మే 2 (ఆంధ్రజ్యోతి) : పథకాలు నిలిచిపోయి గత ఐదేళ్లుగా దాదాపు మూతపడిన మైనారిటీ కార్పొరేషన్‌కు రాష్ట్రప్రభుత్వం జవసత్వాలు చేకూర్చింది. రుణాల కోసం నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మైనారిటీతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లలో 2019 వరకు అమలవుతున్న దాదాపు అన్ని పథకాలను గత వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది. ఆయా సంస్థలను బోర్డులకే పరిమితం చేసేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక బడుగులకు ఊపిరిపోసింది. ఇప్పటికే ఎస్సీ నిరుద్యోగులకు రుణాల మంజూరు చేసేందుకు దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. బీసీ కార్పొరేషన్ ద్వారా అయితే యూనిట్ల గ్రౌండింగ్ కూడా ప్రారంభమైంది. తాజాగా మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరుకు అధికారులు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ నెల 25వతేదీ తుది గడువుగా నిర్ణయిస్తూ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని మైనారిటీ వర్గాలకు రూ.12.05 కోట్ల రుణాలను అందజేయనుంది. నాలుగు శ్లాబులుగా వీటిని నిరుద్యోగులకు ఇవ్వనుంది. అందులో సగం కార్పొరేషన్ సబ్సిడీ కాగా, మిగిలిన సగం బ్యాంకుల నుంచి రుణంగా ఇస్తారు. ఈనెల 25 వరకూ దరఖాస్తులను స్వీకరించి ఆతర్వాత లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మొదటి శ్లాబులో రూ.లక్ష వరకు రుణం అందజేస్తారు. దీని కింద కిరాణా దుకాణం, పాన్ షాపు, చికెన్, మటన్, పండ్ల దుకాణం, కూరగాయల అమ్మకం, ఎలక్ట్రికల్ రిపేర్లు, సైకిల్ షాపు మొదలైన యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. రెండో శ్లాబు కింద రూ.లక్ష నుంచి రూ.3లక్షలు అందజేస్తారు. దీని కింద రుణం పొందిన వారు ఏసీ, ఫ్రిడ్జ్ రిపేర్లు, ఆటోమొబైల్ స్పేరు యూనిట్లు, బ్యాటరీ సర్వీసింగ్, సెల్‌ఫోన్ రిపేర్లు, ఫుట్‌వేర్ దుకాణాలు, ఫ్యాషన్ డిజైన్, బ్యూటీపార్లర్ మొదలైన యూనిట్లను స్థాపించుకోవచ్చు. మూడో శ్లాబు కింద రూ.3 నుంచి రూ.5లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. దీని కింద ఆటోమొబైల్, రవాణా రంగం, ఫ్యాబ్రికేషన్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. నాలుగో శ్లాబు కింద రూ.8 లక్షల వరకు రుణం అందజేస్తారు. దీంతో జనరిక్ మందుల దుకాణాలు, ఆటోమొబైల్ యూనిట్లు, ఫిట్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు
జిల్లాలోని మైనారిటీ వర్గాలకు చెందిన ముస్లింలు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్శీలు ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ కార్పొరేషన్ ఈడీ ధనలక్ష్మి కోరారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఏపీబీఎంఎంఎస్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ ద్వారా పంపాలని ఆమె కోరారు. డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తుతోపాటు సంబంధిత సర్టిఫికెట్లను జత చేసి ఆయా మండల అభివృద్ధి అధికారులకు, మునిసిపల్ కమిషనర్లకు అందజేయాలని కోరారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 21 నుంచి 55 సంవత్సరాలలోపు ఉండాలని తెలిపారు. దరఖాస్తుదారుని కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు మాత్రమే ఉండాలని తెలిపారు. తెలుపు రంగు రేషన్ కార్డు కలిగి ఉండాలని వివరించారు. రవాణా రంగంలో యూనిట్లను ఏర్పాటు చేసుకునే దరఖాస్తుదారులకు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని ఆమె తెలిపారు.