ఆరేళ్ల తర్వాత ఊరట
ABN , Publish Date - Aug 19 , 2025 | 01:19 AM
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు చేసి వైసీపీ ప్రభుత్వ కక్షసాధింపు చర్యతో ఆ బిల్లులు అందక ఆర్థికంగా నష్టపోయిన వారికి ఊరట కలిగించేలా ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాంటివి జిల్లాలో రూ.60కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా.
ఉపాధి పెండింగ్ బిల్లుల మంజూరుకు చర్యలు
నాటి టీడీపీ హయాంలో పెద్దఎత్తున పనులు
చెల్లింపులను నిలిపివేసిన వైసీపీ ప్రభుత్వం
భారీగా బకాయిలతో తెలుగు తమ్ముళ్ల అవస్థ
ప్రస్తుతం వాటి చెల్లింపునకు చర్యలు
ఆరు మాసాల క్రితం రూ.11 కోట్లు జమ
మరో రూ.16.17 కోట్ల విడుదలకు చర్యలు
ఆధారాలతో అప్‌లోడ్ చేస్తున్న అధికారులు
నమోదు చేయకుండా నిలిపివేసిన వాటిపైనా దృష్టి
నియోజకవర్గాల వారీ అధికారుల సమావే శాలు
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు చేసి వైసీపీ ప్రభుత్వ కక్షసాధింపు చర్యతో ఆ బిల్లులు అందక ఆర్థికంగా నష్టపోయిన వారికి ఊరట కలిగించేలా ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాంటివి జిల్లాలో రూ.60కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. అందులో చెల్లించకుండా ఆగిపోయినట్లు అధికారిక లెక్కల్లో చూపిన రూ.11కోట్లను ఆరు మాసాల క్రితం ప్రభుత్వం చెల్లించింది. నమోదు కాకపోయినా పనులు పూర్తి చేసినట్లు అధికారుల వద్ద రికార్డుల్లో ఆధారాలు ఉన్న వాటికి రూ.16.17 కోట్లను ప్రస్తుతం విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరో రూ.30కోట్లకుపైగా అసలు లెక్కాపత్రం లేకుండా నాటి వైసీపీ ప్రభుత్వం ఇబ్బందిపెట్టినవి ఉన్నట్లు అంచనా వేశారు. వాటికి అవసరమైన ఆధారాల సేకరణపై దృష్టి సారించారు. ప్రభుత్వ ఆదేశాలతో డ్వామా జిల్లా అధికారులు నియోజకవర్గాల వారీ కీలక సమావేశాలను ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్వహిస్తున్నారు.
ఒంగోలు ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ ప్రభుత్వం (2014-19)లో ఉపాధి హామీ పథకం పనుల బిల్లులకు ఇప్పుడు మోక్షం లభిస్తోంది. మెటీరియల్ కోటా నిధుల ద్వారా అప్పట్లో పెద్దఎత్తున పనులు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సీసీరోడ్లు, డ్రైన్లు, శ్మశానాల అభివృద్ధి, పాఠశాలలకు ప్రహరీలు, మొక్కల పెంపకం, చెత్త నుంచి సంపద తయారీ (డబ్ల్యూపీసీ) కేంద్రాలు, అంగన్‌వాడీ, పంచాయతీ భవన నిర్మాణాలు భారీగా చేపట్టారు. జిల్లాలో సుమారు రూ.వెయ్యి కోట్ల మేర పనులు నాటి టీడీపీ ప్రభుత్వంలో జరిగాయి.
బిల్లులు చెల్లించకుండా వేధించిన వైసీపీ ప్రభుత్వం
2019 ఎన్నికలకు ముందు చేసిన పనులకు సంబంధించిన బిల్లులను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. అలా రూ.100 కోట్ల వరకు ఆగిపోయాయి. వీటిలో అత్యధిక భాగం టీడీపీ శ్రేణులు చేసి ఉండటంతో వారిని ఆర్థికంగా దెబ్బతీసేందుకు వైసీపీ ప్రభుత్వం అలా వ్యవహరించింది. కొంతకాలం తర్వాత పనులు చేసిన పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో వైసీపీ ప్రభుత్వం విజిలెన్స్, ఇతర శాఖల ఇంజనీరింగ్ సిబ్బందితో తనిఖీలు చేయించింది. పూర్తిచేసిన పనుల్లో భారీగా బిల్లులు తగ్గించి వేధింపులకు గురిచేసింది. ఎక్కువమంది కోర్టుకు వెళ్లలేక, వేధింపులను తట్టుకోలేక బిల్లులు అడగడం మానేశారు. చివరకు కోర్టు ఆదేశాలతో కొందరికి చెల్లించిన నాటి వైసీపీ ప్రభుత్వం భారీగా బిల్లులను అసలు ప్రభుత్వ రికార్డుల్లో (ఆన్‌లైన్‌లో) నమోదు కూడా కాకుండా వర్క్ క్లోజర్ డేటా కింద చూపింది. దీంతో కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం నివేదించే బిల్లుల జాబితాలో అసలు ఆ పనులు నమోదు కాకుండా నిలిచిపోయాయి. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ బిల్లులు రాకపోవడంతో పనులు చేసిన టీడీపీ శ్రేణులు తీవ్రంగా నష్టపోయారు.
కేంద్ర వెబ్‌సైట్‌ను తిరిగి తెరిపించిన మంత్రి పెమ్మసాని
తిరిగి అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం దృష్టికి ఉపాధి పథకం బిల్లుల వ్యవహారం వచ్చింది. దీంతో తొలివిడత అన్ని రికార్డుల్లో నమోదై వివరాలు సక్రమంగా ఉన్న పనులకు చెల్లింపులు చేసింది. అలా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో జిల్లాలో రూ.11కోట్ల పెండింగ్ బిల్లులు జమయ్యాయి. రెండో దశలో పనులు చేసినట్లు రికార్డుల్లో ఉన్న వాటిపై దృష్టి సారించారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో వర్క్ క్లోజర్ కింద చూపడంతో అలాంటి పనులను తిరిగి ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు కేంద్రం అనుమతి అవసరమై జాప్యం నెలకొంది. దీనిపై సీఎం ఆదేశాలతో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవచూపడంతో కేంద్రం నిలిపివేసిన ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను ఇటీవల తిరిగి ఓపెన్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ వివరాలను అధికారులు నమోదు చేస్తున్నారు. జిల్లాలో చిన్నాపెద్దవి కలిపి సుమారు రూ.16.17 కోట్లకు సంబంధించిన 19,393 పనులు ఉన్నట్లు గుర్తించారు. వాటిని ప్రస్తుతం నమోదు చేస్తుండగా నగదు జమవుతున్నదని సమాచారం.
ఆధారాలు ఉంటే చెల్లింపు!
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటికి టీడీపీ శ్రేణులు చేసిన పనుల్లో పూర్తయిన వాటికి చెల్లింపులు నిలిపివేయడమే కాక అసలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, ఎంబుక్‌లో రికార్డు చేయడం వంటివి కూడా ఆపివేసినవి భారీగా ఉన్నాయి. అలాంటి వాటికి కూడా ఆధారాలు ఉంటే తిరిగి నమోదు ప్రక్రియ పూర్తిచేసి చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని సీఎం కార్యాలయం నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో అలాంటి వాటిని గుర్తింపుపై ప్రస్తుతం డ్వామా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
డ్వామా అధికారుల సమావేశాలు
మూడు రోజులుగా జిల్లాలో నియోజకవర్గాల వారీ ప్రజాప్రతినిధుల సమక్షంలో డ్వామా అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పనులు చేయించడంలో కీలకమైన డ్వామా సిబ్బంది, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ సిబ్బందితో సంయుక్తంగా ఈ సమావేశాలను నిర్వహించి అప్పట్లో పనులు చేసిన వారిని కూడా పిలిపిస్తున్నారు. వారి వద్ద ఉన్న ఆదారాలను పరిశీలిస్తున్నారు. ఈ తరహావి కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిపాటి ఆధారాలున్నా అలాంటి వాటిని నమోదు చేసి బిల్లులు అందేలా చర్యలు తీసుకొనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఈక్రమంలో గత గురువారం కొండపి నియోజకవర్గ సమావేశం తూర్పునాయుడుపాలెంలో మంత్రి డాక్టర్ స్వామి క్యాంపు కార్యాలయంలో జరిగింది. డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌తోపాటు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.