Share News

డీఎస్సీ సర్టిఫికెట్ల పునఃపరిశీలన

ABN , Publish Date - Sep 07 , 2025 | 10:55 PM

మెగా డీఎస్సీ ఉపాధ్యాయ ఉద్యోగాల ఎంపికను వంద శాతం పారదర్శకంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. బోగస్‌ అభ్యర్థులకు అవకాశం లేకుండా, అర్హులకు అన్యాయం జరగకుండా సర్టిఫికెట్ల పునఃపరిశీలనతో జల్లెడ పడుతోంది.

డీఎస్సీ  సర్టిఫికెట్ల పునఃపరిశీలన
అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్న బృంద సభ్యులు

అర్హులకు అన్యాయం జరగకుండా చర్యలు

ఇప్పటికే రెండు విడతలుగా ప్రక్రియ

మూడోసారి కూడా నిర్వహణ

ఒంగోలు విద్య, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : మెగా డీఎస్సీ ఉపాధ్యాయ ఉద్యోగాల ఎంపికను వంద శాతం పారదర్శకంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. బోగస్‌ అభ్యర్థులకు అవకాశం లేకుండా, అర్హులకు అన్యాయం జరగకుండా సర్టిఫికెట్ల పునఃపరిశీలనతో జల్లెడ పడుతోంది. ఇప్పటికే రెండుసార్లు పరిశీలన ప్రక్రియనుచేపట్టింది. ప్రస్తుతం మూడోసారి కూడా నిర్వహించింది. రెండోసారి పరిశీలనలో మొదటి విడత అనర్హులుగా ప్రకటించిన వారు అర్హులుగా తేలడంతో వారికి ఎంపిక జాబితాలో అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన సర్టిఫికెట్ల పరిశీనలో ఇంకా ఏమైనా పొరపాట్లు జరిగాయేమోనన్న అనుమానంతో ఆదివారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను చేపట్టారు. గతంలో ఒక బృందం పరిశీలించిన సర్టిఫికెట్లను మరో టీంతో పునఃపరిశీలన చేయిస్తున్నట్లు ఆర్‌జేడీ లింగేశ్వరరెడ్డి తెలిపారు. తొలివిడత పరిశీలనకు 657 మంది అభ్యర్థులను ఆహ్వానించగా వారిలో 652 మంది అర్హులుగా తేలారు. మిగిలిన ఐదుగురిలో ఇద్దరికి సర్టిఫికెట్లు రాకపోవడంతో అనర్హులుగా ప్రకటించారు. మరో ముగ్గురు ఈ పోస్టులు వద్దని చెప్పారు. రెండో విడత 19 మంది సర్టిఫికెట్లను పరిశీలించారు. మూడో విడత ఐదుగురు అభ్యర్థులను పిలిచారు. వీరికి ఆదివారం శ్రీసరస్వతి జూనియర్‌ కళాశాలలోనే సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించి అర్హులుగా ధ్రువీకరించారు.

Updated Date - Sep 07 , 2025 | 10:55 PM