Share News

పత్తికి ఎర్ర తెగులు.. రైతులకు గుబులు

ABN , Publish Date - Sep 03 , 2025 | 11:09 PM

మండలంలో పత్తి సాగు చేసిన రైతు పెట్టుబడులు రాక చిత్తయ్యారు. భూమిని నమ్మి అప్పో సప్పో చేసి పెట్టుబడి పెటి,్ట ఇంటిల్లి పాదీ ఆరుగాలం కష్టించినా మిగిలేది నష్టం తప్ప లాభం లేదని రైతులు కంట తడి పెడుతున్నారు.

పత్తికి ఎర్ర తెగులు.. రైతులకు గుబులు
ఎర్రతెగులు సోకిన పత్తి పైరు

వేసవిలో సాగు చేసిన పైరుకు నష్టం

తగ్గిన దిగుబడులు

ధరలు అంతంతమాత్రమే

కానరాని సీసీఐ

పెద్దదోర్నాల, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : మండలంలో పత్తి సాగు చేసిన రైతు పెట్టుబడులు రాక చిత్తయ్యారు. భూమిని నమ్మి అప్పో సప్పో చేసి పెట్టుబడి పెటి,్ట ఇంటిల్లి పాదీ ఆరుగాలం కష్టించినా మిగిలేది నష్టం తప్ప లాభం లేదని రైతులు కంట తడి పెడుతున్నారు. మండలంలో సుమారు 700 ఎకరాల్లో పత్తిని విత్తారు. ప్రధానంగా ఏప్రిల్‌, మేలో బోరు బావుల కింద సాగు చేసిన పత్తి తీత దశకు వ్చంది. ఇప్పటికే చాలా వరకు రెండు సార్లు పత్తి తీతలు చేశారు. అయితే ఎకరాకు 4,5 క్వింటాళ్లకు మించి దిగుబడులు వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. ఎందుకంటే ఎర్ర తెగులు సోకింది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేక పోగా ఖర్చులు పెరిగాయి. పైగా పురుగు మందులు ధరలు చూస్తే నియంత్రణ లేదు. దిగుబడులు చూస్తే గణనీయం గా తగ్గాయి. గిట్టుబాటు ధరలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. వానకు తడిసిందని, పత్తి నాణ్యత లేదని పలు సాకులతో దళారులు ధరలను పెంచడం లేదు. ప్రస్తుతం క్వింటా రూ.6,000 నుంచి రూ.6,500ల వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.ఎకరా పత్తి సాగు కు దుక్కికి రూ.2,000, గొర్రు, గుంటకకు రూ.1,600, సాల్లు వేసినందులకు రూ.800, పత్తి విత్తినందులకు కూలీలు 3గ్గురికి రూ.900, అంతర సేద్యం ఖర్చు రూ.6,400, కలుపు తీతల ఖర్చు రూ.3,000, బలం మందుకు రూ.6,800, పురుగు మందుల ఖర్చు రూ.20,000, పత్తి తీత ఖర్చు రూ. క్వింటాకు రూ.1,500 చొప్పున సుమారు 5 క్వింటాళ్లకు ఖర్చు రూ.7,500 మొత్తం ఖర్చు, రూ.50,000 అవుతోందని రైతులు చెప్తున్నారు. 5క్వింటాళ్ల పత్తి విక్రయిస్తే వచ్చేది క్వింటా ధర రూ.6,500 చొప్పున లెక్కించినా రూ.35వేలకు మించడం లేదని అంటున్నారు. దీంతో ఎకరాకు రూ.15,000 చొప్పున రైతులు నష్టపోవల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సీసీఐ ద్వారా రూ.8,000లకు పైగా కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించినా ఎక్కడా ఆ జాడ కనిపించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Sep 03 , 2025 | 11:09 PM