రెడ్ అలర్ట్
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:23 AM
మొంథా తుఫాన్ ప్రభావం జిల్లాపై కనిపిస్తోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి వర్షం ప్రారంభమైంది. మంగళ, బుధవారాల్లో తీవ్రత మరింత ఎక్కువగా చూపనుంది. మంగళవారం రాత్రి పొద్దుపోయాక కాకినాడ సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా.
మొంథా ప్రభావంతో ప్రారంభమైన వర్షం
నేడు, రేపు భారీ వర్షాలు
అప్రమత్తంగానే యంత్రాంగం
బీచ్‌లలోకి ప్రవేశాలు రద్దు
విద్యా సంస్థలు మూత
జిల్లా అంతటా అధికారుల సమీక్షలు
అన్నిచోట్లా కంట్రోల్ రూంలు
నిలిచిన వేట, ఒడ్డుకు చేరిన పడవలు
పంటల పరిస్థితిపై రైతుల్లో ఆందోళన
వర్షం పెరిగితే అంతా నష్టమే
మొంథా తుఫాన్ ప్రభావం జిల్లాపై కనిపిస్తోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి వర్షం ప్రారంభమైంది. మంగళ, బుధవారాల్లో తీవ్రత మరింత ఎక్కువగా చూపనుంది. మంగళవారం రాత్రి పొద్దుపోయాక కాకినాడ సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా. అయితే సముద్రంలో చెన్నై వైపు నుంచి తుఫాన్ విశాఖ వైపునకు కదులుతుండటంతో జిల్లాపైనా దాని ప్రభావం తీవ్రంగానే ఉండనుంది. దీంతో వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల సంస్థ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు, గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించాయి. దీంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.
ఒంగోలు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాపై మొంథా తుఫాన్ ప్రభావం మొదలైంది. సోమవారం మధ్యాహ్నం నుంచి జిల్లావ్యాప్తంగా జల్లులు పడుతున్నాయి. సోమవారం నుంచి బుధవారం వరకు తీవ్రంగా ఉంటుందన్న సమాచారంతో ఆదివారం నుంచే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉన్నతాధికారులు తీరప్రాంత మండలాలపై ప్రత్యేక దృష్టి సారించారు. కార్తీక సోమవారం సముద్ర స్నానాలకు పెద్దసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశాలు ఉండటంతో జిల్లా పరిధిలోని కొత్తపట్నం, పాకల, ఈతముక్కల, కనపర్తి ఇతర బీచ్‌లు, తీరాలను మూసివేసి పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ పరిసరాలకు ఎవ్వరినీ రానివ్వలేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక అధికారులతో సమీక్ష చేశారు. కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్‌రాజులు హాజరై జిల్లాలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ స్వామి కూడా కలెక్టర్‌తో పరిస్థితిని సమీక్షించారు. జిల్లా అంతటా ప్రాథమిక పాఠశాల నుంచి ఇంజనీరింగ్ వరకు అన్ని యాజమాన్యాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో వాటిని మూసివేశారు.
ఎగిసిపడుతున్న అలలు..
తుఫాన్ ప్రభావంతో సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో మత్స్యకారులు పడవలను, వలలను ఒడ్డుకు చేర్చుకున్నారు. అధికారుల హెచ్చరికలతో వేటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. తుఫాన్ కారణంగా కురిసే భారీవర్షాలు, గాలులకు విద్యుత్ అంతరాయం, చెట్లు విరిగిప డటం, వాగులు, వంకల్లో నీటి ప్రవాహ ఉధృతితో రవాణాకు ఆటంకంతోపాటు ప్రమాదాలు జరిగే అవకాశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆయా శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. వాగులు పొంగే ప్రాంతాలలో రాకపోకలు ఆపేలా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. చెట్లు విరిగిపడి రవాణాకు ఎదురయ్యే ఆటంకాలను తక్షణం తొలగించేలా రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ సిద్ధమైంది. నీటి వనరులు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ముందస్తు ఏర్పాట్లలో ఇరిగేషన్, అలాగే తాగునీరు సమస్య రాకుండా ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ అంతరా యం ఏర్పడితే వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా విద్యుత్ శాఖ అధికారులు కలెక్టర్ ఆదేశాలతో తగు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మండల స్థాయిలో నియమితులైన స్పెషల్ ఆఫీసర్లు సోమవారం తమకు కేటాయించిన మండలాల్లో పర్యటించి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు..
పునరావాస కేంద్రాలు సిద్ధం
తీర ప్రాంతంలో ఐదు మండలాల్లోని 18 గ్రామాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండనున్న దృష్ట్యా ఆ గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వారిని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు చేర్చేలా ఏర్పాట్లు చేశారు. అందుకోసం పునరావాస శిబిరాలను సిద్ధం చేశారు. పాకల బీచ్ ప్రాంతాన్ని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు సందర్శించి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. పట్టణాల్లో వర్షపు నీరు ఎక్కడికక్కడ రోడ్లపై చేరి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుండటంతో ప్రధాన కాలువల్లో ప్రవాహం సజావుగా సాగేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఒంగోలు నగరంలోని కొప్పోలు రోడ్డులో ఈ తరహా పనులు కమిషనర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతుండగా సోమవారం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరిశీలించారు. నగరంలో ముందస్తు చర్యలపై అధికారులకు తగు సూచనలు చేశారు.
తీవ్ర ఆందోళనలో రైతులు
మొంథా తుఫాన్ ప్రభావంపై రైతుల్లో ప్రత్యే కించి పశ్చిమ ప్రాంతం వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఖరీఫ్ సీజన్‌లో ఆ ప్రాంతంలో పత్తి, మిర్చి, కంది, వరి, సజ్జ, పొగాకు వంటి పంటలు విస్తారంగా సాగయ్యాయి. కొన్ని పంట, మరికొన్ని కోత, ఇంకొన్ని ఎదుగుదల దశలో ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలు వాటిని దెబ్బతీశాయి. ఈ పరిస్థితుల్లో తుఫాన్ రావడం, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆ పంటలన్నీ తుడిచిపెట్టుకపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తుఫాన్ నేపథ్యంలో జిల్లా నుంచి చెన్నై ఇటు విజయవాడ- చెన్నై, అటు గుంటూరు- గుంతకల్ మార్గాలలో పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దుచేశారు ఆర్టీసీ అధికారులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టులోకి 9,767 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో నాలుగు గేట్లు ఎత్తి ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.