అద్దంకిలో రియల్ ధరలకు కదలిక
ABN , Publish Date - Dec 23 , 2025 | 01:42 AM
అద్దంకిలో రియల్ ఎస్టేట్ ధరలలో ఒక్కసారి గా కదలిక వచ్చింది. ఇటీవల వరకు స్తబ్దుగా ఉన్న ఽస్థలాల ధరలతో రియలెస్టేట్ వ్యాపారం ఆగిపోయింది.
అద్దంకి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): అద్దంకిలో రియల్ ఎస్టేట్ ధరలలో ఒక్కసారి గా కదలిక వచ్చింది. ఇటీవల వరకు స్తబ్దుగా ఉన్న ఽస్థలాల ధరలతో రియలెస్టేట్ వ్యాపారం ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదట్లో రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతా యని భావించినా పెద్దగా కదలిక లేదు. అయితే ఇటీవల అద్దంకి నియోజకవరాన్ని ఒంగోలు కేంద్రంగా ఉండే ప్రకాశం జిల్లాలో కలపడం, అద్దంకి కేంద్రంగా అద్దంకి, దర్శి నియోజకవర్గాలను కలిపి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అద్దంకిలో రియల్ ఎస్టేట్ ధరలలో కదలిక వచ్చింది. మినీబైపాస్ రోడ్డు ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు కూడా తొలగి ఆక్రమణలు తొల గింపు జరుగుతుండడం, కాలువ కట్టలను ప్రాథమికంగా అభివృద్ధి చేసేందుకు గ్రావెల్ లోతుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పరుగులు తీస్తున్నారు. ప్రధానంగా అద్దంకి మేజర్ కాలువకు తూర్పువైపున ఉన్న పలు కాలనీలలో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అదేసమయంలో రేణింగవరం రోడ్డులో చెరువు కొమ్ముపాలెం క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సుమారు 14 ఎకరాల ప్రభుత్వ భూమిలో డివిజన్ స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశం ఉండడం, స్టేడియం కూడా నిర్మించే అవకాశం ఉండడంతో రేణింగవరం రోడ్డులో కూడా రియల్ ఎస్టేట్ ధరలు పెరిగాయి. దశాబ్ద కాలం క్రితం వెంచర్లు వేసి చిల్లచెట్లు తో నిండి ఉన్న ప్రాంతాలను కూడా ముస్తాబు చేసి సిద్ధం చేస్తున్నారు. గతంలో కొనుగోలు చేసిన వారిలో ఆనందం వెల్లువిరుస్తుండగా కొత్తగా ఆయా ప్రాంతాలలో స్థలాలు కొను గోలు చేసేందుకు సిద్దమయ్యే వ్యక్తులు మాత్రం పరుగులు తీస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిద్ధం అవుతున్నారు.