రాజముద్రతో రెడీ
ABN , Publish Date - Oct 26 , 2025 | 01:04 AM
గత వైసీపీ ప్రభుత్వంలో రైతుల భూములకు జగన్మోహన్‌రెడ్డి బొమ్మతో ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాల స్థానంలో ప్రజాప్రభుత్వం రాజముద్రతో పుస్తకాలను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రెండు నెలల క్రితమే జిల్లాకు 72,006 పాసుపుస్తకాలు వచ్చాయి.
డల కార్యాలయాల్లో పట్టాదారు పాసుపుస్తకాలు
తప్పులు సరిచేసిన అధికార యంత్రాంగం
ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వెంటనే పంపిణీ
ఒంగోలు కలెక్టరేట్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ ప్రభుత్వంలో రైతుల భూములకు జగన్మోహన్‌రెడ్డి బొమ్మతో ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాల స్థానంలో ప్రజాప్రభుత్వం రాజముద్రతో పుస్తకాలను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రెండు నెలల క్రితమే జిల్లాకు 72,006 పాసుపుస్తకాలు వచ్చాయి. అయితే గత ప్రభుత్వం ఇచ్చిన తప్పులతోనే వీటిని ముద్రించినట్లు ఫిర్యాదులు రావడంతో క్షేత్రస్థాయిలో విచారణ చేసి సరిచేసే ప్రక్రి యను ప్రారంభించారు. ఆయా గ్రామాల వారీగా చేపట్టిన ఈ కార్యక్రమం కూడా దాదాపు పూర్తయి నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా పాసుపుస్తకాలు మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో నిల్వ చేశారు. మార్కాపురం డివిజన్‌కు 17,122, కనిగిరి డివిజన్‌కు 23,858, ఒంగోలు డివిజన్‌కు 31,026 పట్టాదారు పాసుపుస్తకాలు కొత్తవి వచ్చాయి. ఆయా గ్రామాల వారీగా వచ్చిన ఫిర్యాదులను కూడా పరిగణనలోకి తీసుకొని పాసుపుస్తకాలు పంపిణీ చేసే నాటికి వాటన్నింటినీ పూర్తిస్థాయిలో పరిశీలించి చేర్పులు, మార్పులు ఉంటే సరిచేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికారులు తదనుగుణంగా చర్యలు తీసుకున్నారు. ఈ పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయిలో త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఆ రోజున ఆయా నియోజకవర్గాలలో మంత్రులు, శానన సభ్యుల సమక్షంలో రాజముద్రతో ముద్రించిన పాసుపుస్తకాల పంపిణీకి రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేశారు.